‘భగీరథ’పై శ్రద్ధ పెట్టండి  

28 Jun, 2018 09:11 IST|Sakshi
కోమటిచెరువులో కొత్తగా ఏర్పాటు చేసిన అమెరికా బోట్‌ను నడుపుతున్న మంత్రి హరీశ్‌

15న మిషన్‌ భగీరథ పైలాన్‌ ప్రారంభం

సిద్దిపేటలోని అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటటౌన్‌ : మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసిన తొలి జిల్లాగా సిద్దిపేటను ప్రకటించనున్న నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు.. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు సూచించారు. బుధవారం మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేటలో మినీ ట్యాంక్‌ బండ్‌ వద్ద మిషన్‌ భగీరథ పైలాన్‌ను జూలై 15న ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.

జూలై 10 లోపు జిల్లాలో మిషన్‌ భగీరథ పనులన్నీ పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు మంత్రి సూచించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, బెజ్జంకి, హుస్నాబాద్‌ మండలాల్లో పైప్‌లైన్లు లీకేజీ అవ్వకుండా వర్టికల్‌ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా జరిగే మహిళా వీవోల సమావేశాలలో తాగునీరు, నల్లా బిగింపు తదితర చర్యలపై మహిళా సంఘాల సభ్యుల సమక్షంలో ప్రత్యేక ఎజెండా పెట్టి.. అవగాహన కల్పించాలని సూచించారు.

నీటి వృథా చేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించే విషయమై ఎంపీడీఓలకు సూచనలు చేశారు. ఈనెల 30వ తేదీన కలెక్టర్‌ సమక్షంలో మరోసారి మిషన్‌ భగీరథపై సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికి పెండింగ్‌ పనుల నివేదికలతో రావాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ జిల్లా అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు.

మున్సిపాలిటీపై సమీక్ష

సిద్దిపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి సమీక్షిస్తూ.. స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలోని 7 వార్డులలో పూర్తిగా, మరో 4 వార్డులలో పాక్షికంగా జూలై ఆఖరు వరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఫలితాలు వస్తాయన్నారు.

పట్టణంలోని చింతల్‌ చెరువు వద్ద చేపడుతున్న ఎస్టీపీ–సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో 90 కిలోమీటర్లకు 70 కిలోమీటర్లు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. పట్టణంలోని మొత్తం 324 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి గాను 94 కిలోమీటర్ల వరకు పూర్తి చేసినట్టు పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఈఈ వీరప్రతాప్‌ మంత్రికి వివరించారు.

మరిన్ని వార్తలు