వలస కార్మికులపై పన్ను పోటు

25 Nov, 2016 02:29 IST|Sakshi
 స్వదేశానికి పంపే సొమ్ముపై కువైట్‌లో 5శాతం పన్ను
 వీసా రెన్యువల్ కోసం ఇప్పటికే భారం మోపుతున్న కంపెనీలు
 
 మోర్తాడ్: కువైట్ ప్రభుత్వం వలస కార్మికులపై పన్ను భారం మోపుతోంది. అక్కడి వివిధ కంపెనీల్లో పని చేసే విదేశీయులు తమ ఇళ్లకు సొమ్ము పంపించాలంటే అందులో 5 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గడువు ముగిసిన కంపెనీ వీసాల రెన్యువల్ కోసం సొమ్ము వసూలు చేస్తుండగా.. ఈ కొత్త పన్ను కార్మికులకు మరింత భారంగా మారనుంది. కువైట్‌లో మన రాయబార కార్యాలయం ఇటీవల తీసిన లెక్కల ప్రకారం 9, 21, 666 మంది భారతీయులు పని చేస్తున్నారు. ఇందులో కనీసం 30 శాతం మంది కార్మికులు తెలంగాణకు చెందినవారు ఉంటారు. గతేడాది నుంచి కువైట్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న కార్మికుల వీసా గడువు ముగిస్తే రెన్యువల్ కోసం కొంత రుసుము చెల్లించాలని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించింది. దీంతో అవి ఆ భారాన్ని కార్మికులపైనే మోపి వారి నుంచి వీసా రెన్యువల్ సొమ్మును ముక్కుపిండి వసూలు చేస్తున్నారుు.
 
  దీంతో కార్మికులు రెండేళ్లకోసారి వీసాల కోసం రూ.65 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇళ్లకు పంపించే డబ్బులపై 5 శాతం పన్ను వేయడం వల్ల రూ. 10 వేలు ఇంటికి పంపాలంటే.. రూ. 500 పన్ను చెల్లించాలి. ఒక్కో కార్మికుడు నెలకు కనీసం రూ.25 వేల వేతనం పొందుతాడు. అందులో రూ.20 వేల వరకు ఇళ్లకు పంపిస్తారు. అంటే ఒక్కో కార్మికుడు నెలకు రూ. 1,000 పన్నుగా చెల్లించాలి. ఒక వేళ సొమ్ము మొత్తం తమ దగ్గరే ఉంచుకొని.. తాము ఇంటికి వస్తున్నప్పుడు తీసుకెళ్దామనుకున్నా అక్కడి చట్టాల ప్రకారం సాధ్యం కాదు. దీంతో కార్మికులు తప్పని సరిగా పన్ను చెల్లించా ల్సిన పరిస్థితి. ఈ పన్నును డిసెంబర్‌లో జరిగే కువైట్ పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందనుందని తెలిసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 

 

మరిన్ని వార్తలు