రైలు ప్రమాదాల నివారణకు ‘టీసీఏఎస్‌’

8 Apr, 2018 03:43 IST|Sakshi
యార్డు ప్రారంభ కార్యక్రమంలో ఘన్‌శ్యామ్‌ సింగ్, వినోద్‌ కుమార్‌యాదవ్ తదితరులు

ఎదురెదురుగా వచ్చే రైళ్ల నియంత్రణ 

ట్రైన్‌ కోలిషన్‌ ఎవాయిడ్‌ సిస్టమ్‌ అభివృద్ధి

సాక్షి, హైదరాబాద్‌: రైలు ప్రమాదాల నివారణకు దక్షిణ మధ్య రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చే రైళ్లు సిగ్నలింగ్‌ వ్యవస్థ లోపం, డ్రైవర్ల నిర్ల క్ష్యం కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. దీనిని అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. రెండు రైళ్లు ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చినా ప్రమాదం జరగకుండా నివారించే పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. అదే ‘ట్రైన్‌ కోలిషన్‌ ఎవాయిడ్‌ సిస్టమ్‌’ (టీసీఏఎస్‌). మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే తొలిసారి తయారు చేసిన ఈ డివైజ్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైంది. శనివారం లింగంపల్లి–వికారాబాద్‌ సెక్షన్‌లో జరిపిన ట్రయల్‌రన్‌ను రైల్వేబోర్డు ట్రాక్షన్‌ సభ్యులు ఘన్‌శ్యామ్‌సింగ్, దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. టీసీఏఎస్‌ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తే రైలు ప్రమాదాల నియంత్రణలో కీలకమైన ముందడుగు కాగల దని ఘన్‌శ్యామ్‌ అభిప్రాయపడ్డారు.  

ఎలా పని చేస్తుందంటే... 
టీసీఏఎస్‌ ఒక ఎలక్ట్రానిక్‌ డివైజ్‌. దీనిని రైలు ఇంజిన్లలో అమరుస్తారు. ఇది ఉన్న రైళ్లు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చినప్పుడు డివైజ్‌లోని సెన్సార్లు పనిచేస్తాయి. సిగ్నలింగ్‌ సంకేతాలు వెలువడుతాయి. రైళ్లు ఒక కిలోమీటర్‌ దూరంలో ఉన్నప్పుడే టీసీఏఎస్‌ పనిచేస్తుంది. ఒక ఇంజిన్‌ నుంచి మరో ఇంజిన్‌కు సంకేతాలు అందుతాయి. దీంతో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతాయి. దక్షిణ మధ్య రైల్వేలోని సుమారు 600కు పైగా రైళ్లకు ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలంటే వందల కోట్లు ఖర్చు కావచ్చని అధికారుల అంచనా.  

మెయింటెనెన్స్‌ యార్డు ప్రారంభం  
శనివారం లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో మెయింటె నెన్స్‌ యార్డును త్వరలో రిటైర్డ్‌ కానున్న కార్మికుని చేతుల మీదుగా ప్రారంభించారు. గౌతమి, కోకెన డ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు లింగంపల్లి నుంచే నడిపేందు కు యార్డు నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు