తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నా

25 Mar, 2019 18:08 IST|Sakshi
మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  

ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాను

భువనగిరి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తిని తానేనని, భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొగ్లూర్‌ గేటు సమీపంలో ఉన్న కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.

తాను తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించానని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని వదులుకొని పాల్గొన్న చరిత్ర తనదన్నారు. సోనియాగాంధీ పిలిచి మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని వారించినా, తాను పట్టించుకోలేదన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఆ ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కిందన్నారు. ఎల్‌బీనగర్‌లో అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని దగ్గరుండి అస్పత్రికి తీసుకెళ్లానన్నారు.

భువనగిరి అభివృద్ధి కోసం అన్నివిధాలుగా కృషి చేస్తానని చెప్పారు. ఎవరికీ ఏ అపద వచ్చినా తాము ముందుంటామని అన్నారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించి సేవలందించామని తెలిపారు. చేవెళ్ల, పెద్దపల్లి, మల్కాజ్‌గిరి, భువనగిరితో పాటు మరో రెండు సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రెడ్డి, జయమ్మ, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జెడ్పీటీసీ అయిలయ్య, ఈసీ శేఖర్‌గౌడ్, ఆదిబట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు