‘రిటైర్మెంట్‌’ పెంపు.. ఐఆర్‌పై చర్చ

18 Jun, 2019 01:24 IST|Sakshi

ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు కేబినెట్‌ సమావేశం

‘కాళేశ్వరం’ నిర్మాణ వ్యయం పెంపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు ఓకే!

కోకాపేటలో శారదా పీఠానికి 2 ఎకరాల భూ కేటాయింపు?

రుణ ఉపశమన కమిషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం!

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం కీలక కేబినెట్‌ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే మంత్రివర్గ భేటీలో వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. చాలా రోజుల తర్వాత జరుగుతున్న మంత్రివర్గ సమావేశం కోసం ప్రభుత్వం భారీ అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించడానికి ఫిబ్రవరి 22న చివరిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు జరగడంతో దాదాపు 9 నెలలుగా రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. పలు కీలక అంశాలపై ప్రభుత్వ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. తాజాగా మంగళవారం నిర్వహిస్తున్న మంత్రివర్గ సమావేశం ముందు పెండింగ్‌ ప్రతిపాదనలతోపాటు కొత్త ప్రతిపాదనలను ఉంచాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.

ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి డజనుకుపైగా అంశాలను ప్రభుత్వం మంత్రివర్గం ముందు ఉంచబోతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం పెంపు, ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా మరో టీఎంసీ నీరు తరలింపు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ తదితర ప్రధాన అంశాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని 22 కొత్త జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల కోసం భూముల కేటాయింపు ప్రతిపాదనలను ప్రభుత్వం కేబినెట్‌ ముందుంచనుంది. అలాగే రుణ ఉపశమన కమిషన్‌ చట్ట సవరణ బిల్లును కేబినెట్‌ ఆమోదించే అవకాశాలున్నాయి. ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన పూర్తికాకపోవడంతో ఈ కేబినెట్‌ సమావేశంలో పెట్టే అవకాశం లేకుండా పోయింది. కొత్త మున్సిపల్‌ చట్టం సిద్ధమైనా మంత్రివర్గ సమావేశంలో పెట్టడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం నుంచి చివరి నిమిషంలో పిలుపు వస్తే కొత్త మున్సిపల్‌ చట్టాలను కేబినెట్‌ ముందు ఉంచి ఆమోదించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శారదా పీఠానికి కోకాపేటలో 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ కేబినెట్‌ ఎజెండాలో ఉండబోతున్నాయి. 

రిటైర్మెంట్‌ వయసు పెంపుపై ప్రకటన! 
ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం మంత్రివర్గ సమవేశంలో చర్చించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలా లేక ఫిట్‌మెంట్‌ వర్తింపజేయాలా అనే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల ఏపీ మంత్రివర్గం సమావేశమై అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టి మంగళవారం జరగనున్న కేబినెట్‌ భేటీపై కేంద్రీకృతమై ఉంది. మధ్యంతర భృతితోపాటు శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశంపై మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశముందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యంతర భృతి ప్రకటన/పీఆర్సీ అమలులో జాప్యంపట్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్‌ అధికారులు, పెన్షనర్ల జేఏసీ కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై మంత్రివర్గంలో తప్పకుండా చర్చించవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. మధ్యంతర భృతి చెల్లింపు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్‌ కసరత్తు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.  

మరిన్ని వార్తలు