త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌: చక్రపాణి

14 Aug, 2017 19:50 IST|Sakshi
త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌: చక్రపాణి

► వైద్యశాఖలో 400 పోస్టులు
► వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోల భర్తీ


ఖమ్మం: రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ గంటా చక్రపాణి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే 5వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టామని, త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయని అన్నారు. 15వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో పూర్తిస్థాయిలో నియామకాలు జరుగుతాయన్నారు.

12 ఏళ్లుగా వివాదంలో ఉన్న గ్రూప్‌-1 పోస్టుల భర్తీని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి జీవో వస్తే వెంటనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, మొత్తం 8వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయన్నారు. రెండు మూడు రోజుల్లోనే ఫారెస్ట్‌ బీట్‌, రేంజ్‌ అధికారుల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఈ పోస్టులకు ఇంటర్‌ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావైద్యం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ఆ శాఖలో కూడా ఖాళీల భర్తీకి మరో 400 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా విడుదల చేస్తామని, ప్రధానంగా పారామెడికల్‌ స్టాఫ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌లు ఉంటాయన్నారు. వ్యవసాయ శాఖలో 10,150 ఏఈవోలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్‌ కూడా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు