ఇంగ్లిష్‌ నైపుణ్యాలకు ప్రాధాన్య పాయింట్లు!

13 Jan, 2020 02:20 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

ఆలోచనలు చేస్తున్నపాఠశాల విద్యా శాఖ

ఎందరికి నైపుణ్యాలున్నాయో తెలుసుకునేందుకు పరీక్ష

నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్య పాయింట్లు ఇచ్చే ఆలోచనలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు కావాలంటున్నారు. తమ పిల్లలకు ఇంగ్లిష్‌ చదువులు చెప్పించాలని కోరుతున్నారు. దీనికి అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధించే నైపుణ్యాలు ఎంతమందిలో ఉన్నాయి.. నైపుణ్యాలు గలవారిని ఎలా గుర్తించాలి? వారు ఇంగ్లిష్‌ స్కూళ్లలో బోధించేందుకు ఏ చర్యలు చేపట్టాలని తర్జనభర్జన పడుతోన్న విద్యా శాఖకు ఓ ఆలోచన తట్టింది. టీచర్లకు ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలపై పరీక్ష నిర్వహించి, ఆ నైపుణ్యాలు కలిగిన వారిని గుర్తించి ముందుకుసాగితే ఉపయోగంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చింది. అంతేకాదు వారిని ప్రోత్సహించి ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో బోధించేలా చేసేం దుకు వారికి ప్రా«ధాన్య పాయింట్లు ఇస్తే బాగుంటుందని భావిస్తోంది. విద్యా శాఖ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే పాయింట్లను (రెగ్యులర్‌గా వారికి వచ్చే పాయింట్లకు అదనంగా) వారి బదిలీలు, పదోన్నతుల్లో ఉపయోగించుకునేలా చూడటం ద్వారా ఆయా టీచర్లకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో వారు బాగా పనిచేస్తారని, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో వారి సేవలను సద్వినియోగపరచుకోవచ్చని, మెరుగైన విద్యను అందించవచ్చని యోచి స్తోంది. త్వరలోనే దీనిపై ఉన్నతస్థాయి భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది.

ప్రైమరీ స్కూళ్లు ఇంగ్లిష్‌ వైపు..
రాష్ట్రంలో 26,754 ప్రభుత్వ పాఠశాలల్లో 1,21,657 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో ఇంగ్లిష్‌ సబ్జెక్టు టీచర్లు 14,170 మంది ఉండగా, సబ్జెక్టు కాకపోయినా మరో 20వేలమంది వరకు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల  టీచర్లు ఇంగ్లిష్‌ నేర్పించాల్సిందే. దీంతో ఇంగ్లిష్‌ టీచర్లు కాకుండా మిగతా వారిలో ఎంతమందికి ఇంగ్లిష్‌లో బోధించే నైపుణ్యాలున్నాయో తెలుసుకునే చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 18,230 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, అందులో 2018 నుంచి 6వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభమైంది. 4 వేల కు పైగా ఉన్నత పాఠశాలల్లోనూ ఇంగ్లిష్‌ మీడియం సక్సెస్‌ స్కూళ్లలో 2008లోనే ప్రారంభమైంది. ఇంగ్లిష్‌ మీడియం కావాలన్న డిమాండ్‌ దృష్ట్యా ఇప్పుడున్న స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం సెక్షన్‌ ప్రారంభించడం లేదా ఇంగ్లిష్‌ మీడియానికి మార్పు చేసే అధికారాన్ని డీఈవోలకు ఇచ్చేలా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.
ఇంగ్లిష్‌ మీడియంలో 37 శాతం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 26,87,563 మంది విద్యార్థులు చదువుతుండగా, అందులో 10,16,334 మంది (37.82 శాతం) విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారు. ఇక తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థులు 15,44,208 మంది ఉన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 31,22,927 మంది విద్యార్థులు ఉండగా, అందులో 30,27,459 మంది ఇంగ్లిష్‌ మీడియం వారే.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు