23 తర్వాత సమ్మె.. మరో హెచ్చరిక

16 Oct, 2019 02:58 IST|Sakshi

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌ హెచ్చరిక

చర్చలు విఫలం అయ్యాయని ప్రకటన

సఫలమయ్యాయన్న టీఆర్‌ఎస్‌కేవీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యా లతో మంగళవారం సాయంత్రం విద్యుత్‌ సౌధలో జరిపిన చర్చలు విఫలమయ్యాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్‌ యూనియన్స్‌ ఫ్రంట్‌ (టీటఫ్‌) ప్రకటించింది. గతంలో ప్రకటించిన విధంగా మంగళవారం మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా యథాతథంగా నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నెల 23న వరంగల్‌లో మహాసభ నిర్వహించి సమ్మెపై ప్రకటన చేస్తామని టీటఫ్‌ చైర్మన్‌ ఎన్‌.పద్మారెడ్డి, కన్వీనర్‌ ఇ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలి పారు. 23వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మెకు దిగుతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. విద్యుత్‌ సంస్థల్లో ఆర్టిజన్లుగా విలీనమైన ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఏపీఎస్‌ ఈబీ సర్వీసు రూల్స్‌ వర్తింపజేస్తే న్యాయపర ఇబ్బందులు ఎదు రవుతాయని యాజమాన్యం తేల్చి చెప్పడంతోపాటు ఇతర డిమాండ్ల దాటవేత వైఖరిని ప్రదర్శించడంతో చర్చల నుంచి టీటఫ్‌ నేతలు వైదొలిగామన్నారు. విద్యుత్‌ సంస్థల యాజ మాన్యాల తరఫున ట్రాన్స్‌కో జేఎండీ చెరుకూరి శ్రీనివాసరావు నేతృత్వంలో డైరెక్టర్ల బృందం టీటఫ్‌తో గంట పాటు చర్చలు నిర్వ హించింది.

ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్‌ వర్తింప జేయడం సాధ్యం కాదని, వీటికి బదులుగా స్టాండింగ్‌ ఆర్డర్స్‌ను వర్తింపజేస్తామని స్పష్టం చేసింది. ఆర్టిజన్లకు మూలవేతనాన్ని త్వరలో ఖరారు చేస్తామని, డీఏ స్థానంలో వీడీఏ పాయింట్లు ఇస్తామని, చనిపోయిన ఆర్టిజన్ల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశం కల్పిస్తామని పేర్కొంది. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ రూల్స్‌ వర్తింపజేయడంతో పాటు డీఏ, టీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఆర్సీని వర్తింపజేయాలని చర్చల్లో టీటఫ్‌ పట్టుబట్టింది. 1999 ఫిబ్రవరి 1 నుంచి సర్వీసులో చేరిన విద్యుత్‌ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్‌ పెన్షన్‌ పథకాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్‌పై సీఎం కేసీఆర్, విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో చర్చించాల్సి ఉందని, ఇందుకు సమయం కావాలని అధికారులు కోరారు. యాజమాన్యాలపై గౌరవ భావంతో ఈ నెల 11న వరంగల్‌లో నిర్వహించాల్సిన ధర్నాను విరమించుకుని చర్చలకు వస్తే తమకు అన్యాయమే జరిగిందని టీటఫ్‌ పేర్కొంది. చర్చల సందర్భంగా యాజమాన్యం స్పందన సరిగా లేదని ఆరోపించింది. చర్చల్లో టీటఫ్‌ చైర్మన్‌ ఎన్‌.పద్మారెడ్డి, కన్వీనర్‌ ఈ.శ్రీధర్, కో చైర్మెన్‌ ఎంఏ వజీర్, కో కన్వీనర్లు ఎస్‌.శ్రీధర్‌ గౌడ్, కె.కుమారస్వామి, జి.సాయిబాబా, మజీద్, గంబో నాగరాజు, సాయిలు పాల్గొన్నారు.

చర్చలు సఫలం..: టీఆర్‌ఎస్‌కేవీ
విద్యుత్‌ సంస్థలతో చర్చలు విఫలమైనట్లు 21 సంఘాలతో ఏర్పడిన టీటఫ్‌ ప్రకటించగా, చర్చలు సఫలమయ్యాయని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం (టీఆర్‌వీకేఎస్‌) ప్రకటించింది. ఆర్టిజన్లకు స్టాండింగ్‌ రూల్స్‌ అమలుకు తాము సానుకూలంగా ఉన్నామని, అన్ని సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం హామీనిచ్చిందని టీఆర్‌వీకేఎస్‌ నేతలు ప్రకాశ్‌రావు, జాన్సన్, సీహెచ్‌ రమేశ్‌లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా