నేటితో ‘అయోధ్య’ వాదనలు పూర్తి!

16 Oct, 2019 03:01 IST|Sakshi

సాయంత్రం 5 వరకు వాదనలు విననున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:వివాదాస్పద రామజన్మభూమి– అయోధ్య కేసు వాదనలను బుధవారంతో ముగించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. అక్టోబర్‌ 18తో అయోధ్య కేసు వాదనలను ముగించాలని తొలుత నిర్ణయించినా..16వ  తేదీతోనే ముగించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఈ కేసుకు సంబంధించిన వాదనలన్నీ నేటితో ముగించాలని మంగళవారం హిందూ, ముస్లిం పార్టీలకు సూచించింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పేర్కొన్నారు.

మంగళవారం కూడా సాయంత్రం 5 గంటల వరకు వాదనలు విన్నది. సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ కేసును 39 రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. సీజేఐ పదవీకాలం నవంబర్‌ 17తో ముగియనుంది. అప్పటికల్లా తీర్పు వెలువడకపోతే కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలోపే తీర్పు వెలువరించాలని ధర్మాసనం భావిస్తోంది. గతంలో ఓ సందర్భంలో సీజేఐ మాట్లాడుతూ.. ‘అయోధ్య కేసులో తీర్పు వెలువరించేందుకు నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఇంత స్వల్ప∙సమయంలో తీర్పు చెప్పడం ఓ అద్భుతం లాంటిదే’అని పేర్కొన్నారు.

బాబర్‌ తప్పును సరిదిద్దాల్సి ఉంది..
రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించి బాబర్‌ చక్రవర్తి చారిత్రక తప్పిదం చేశారని.. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని హిందూ పార్టీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. హిందూ పార్టీ తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ కె.పరాశరన్‌ వాదనలు వినిపించారు.

న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం
భూసేకరణ చట్టంపై విచారణ నుంచి తప్పుకోవాలంటూ తనపై సోషల్‌ మీడియాలో వచ్చిన కథనాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఫలానా జడ్జి అంటూ ఆ కథనాల్లో వేలెత్తి చూపకున్నా న్యాయ వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం  జరిగిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టే భూసేకరణలో నిబంధనలపై గతంలో రెండు ధర్మాసనాలు వేర్వేరుగా తీర్పులు వెలువరించాయి. ఆ ధర్మాసనాల్లో ఒకదానికి జస్టిస్‌ మిశ్రా నేతృత్వం వహించారు.

పరస్పర విరుద్ధ తీర్పులు వివాదాస్పదం కావడంతో ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు గతంలో సుప్రీంకోర్టు ప్రకటించింది. అయిదుగురు సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో జస్టిస్‌ మిశ్రా కూడా ఉన్నారు. దీనిపై కొన్ని పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, ఆ ధర్మాసనం నుంచి జస్టిస్‌ మిశ్రా వైదొలగా లంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వెలు వడ్డాయి. మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ మిశ్రా వీటిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు