8పాయింట్ల గ్రేడింగ్‌

23 Dec, 2017 01:47 IST|Sakshi

ప్రభుత్వానికి ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రతిపాదన

మార్కుల విధానానికి స్వస్తి పలికేందుకే..

మార్చిలో ఫస్టియర్‌ విద్యార్థులకు అమలు చేసే చాన్స్‌

ఆ తర్వాత ఏడాది ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు..

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్‌ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2019లో రెండో సంవత్సర విద్యార్థులకు ఈ విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మార్కుల విధానం వల్ల తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఆ అంచనాలను అందుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కుల విధానానికి స్వస్తిపలికి కేవలం గ్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్‌ బోర్డు, తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులతో ఏర్పాటైన సలహా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానం ఉన్నా ఏ గ్రేడ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులవుతున్నారనే వివరాలను మాత్రమే బోర్డు ఇస్తోంది. విద్యార్థుల మెమోల్లో గ్రేడ్లను ఇవ్వడం లేదు. కానీ ఇకపై మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్‌ విధానాన్ని అమల్లోకి తేవాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది.

పదో తరగతి తరహాలోనే....
రాష్ట్రంలో పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లో గ్రేడింగ్‌ విధానాన్ని బోర్డు అమల్లోకి తేనుంది. ఎనిమిది పాయింట్లుగా తీసుకురానున్న ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకు మార్కుల పరిధిని బట్టి గ్రేడ్‌ పాయింట్లు, గ్రేడ్, అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్‌ పాయింట్లనుబట్టి గ్రేడ్‌ పాయింట్ల యావరేజ్‌ ఇస్తారు. అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్ల యావరేజ్‌నుబట్టి ఓవరాల్‌ గ్రేడ్‌ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫెయిల్‌ అయిన వారికి మాత్రం జీరో గ్రేడ్‌ పాయింట్‌తో ఈ గ్రేడ్‌ ఇస్తారు.

ఎంసెట్‌లో వెయిటేజీపై 3 ప్రతిపాదనలు...
గ్రేడింగ్‌ విధానం అమలు నేపథ్యంలో ఇంటర్‌ మార్కులకు ఉన్న వెయిటేజీ విషయంలో బోర్డు ప్రభుత్వానికి పంపేందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో తొలి ప్రతిపాదన ఎంసెట్‌ ర్యాంకుల ఖరారులో ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించి ఎంసెట్‌ మెరిట్‌ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. ఇక రెండోది మార్కులకు బదులు సబ్జెక్టులవారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లనుబట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వడం. ఇక మూడోది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా బోర్డు వద్ద మార్కులు ఉంటాయి కాబట్టి ఎంసెట్‌ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కులను బోర్డు ఎంసెట్‌ కన్వీనర్‌కు అందజేస్తే ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ఎంసెట్‌ ర్యాంకులు ఖరారు చేయడం. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో వెయిటేజీ రద్దుపైనే బోర్డు దృష్టిసారిçంచినట్లు తెలిసింది. ఎందుకంటే విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్‌ రాసినా, ఇంటర్‌ మార్కుల కోసం లేదా జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నా మార్కులు వారికి తెలిసేటప్పటికి ప్రవేశాలు పూర్తవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు