తొలిసారి అసెంబ్లీ బరిలో ముగ్గురు

18 Nov, 2018 11:23 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా ఎన్నికల రంగం వేడెక్కింది.  ఏ నియోజకవర్గంంలో ఎవరెవరు ప్రత్యర్థులో... ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. మెజారిటీ స్థానాల్లో ఈసారి ద్విముఖ పోటీలే కనిపిస్తున్నాయి. కాగా, కొన్నిచోట్ల మాత్రం బహుముఖ పోటీ తప్పేలా లేదు. టీఆర్‌ఎస్‌ పదకొండు, కాంగ్రెస్‌ పదకొండు స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీరిలో ఇప్పటికే అత్యధికులు నామినేషన్లు కూడా వేశారు. చివరి రోజు అయిన 19వ తేదీన ఎక్కువ నామినేషన్లు దాఖలు కానున్నాయి. టీఆర్‌ఎస్‌ కోదాడలో, కాంగ్రెస్‌  మిర్యాలగూడ స్థానానికి ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన వారిని పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కూడా హేమాహేమీలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ కూడా హోరాహోరీగా సాగనుంది.

ఆ.. ఐదుగురు నేతలు
టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ పడుతున్న వారిలో ఒక్కరు మినహా  మిగిలిన పది మంది రెండో సారి అంతకంటే ఎక్కువ పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేస్తున్నవారే. ఇక, కాంగ్రెస్‌లో నలుగురు నాయకులు, ఒక ఇండిపెండెంట్‌ మొత్తంగా ఐదుగురు అభ్యర్థులు నాలుగు అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీ బరిలో నిలుస్తున్నవారే కావడం గమనార్హం. ప్రధానంగా సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఎనిమిదో విజయం కోసం నాగార్జున సాగర్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య పోటీలో ఉన్నారు. బీజేపీ, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు కొందరు తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్న వారే. హుజూర్‌నగర్‌లో టీ.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఐదో విజయంపై కన్నేశారు.

ఆయనకు ప్రత్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి తొలి సారిగా ఎస్‌.సైదిరెడ్డి పోటీలో ఉన్నారు. సీపీఎం అభ్యర్థి రెండో సారి పోటీలో ఉన్నారు. నల్లగొండలో కాంగ్రెస్‌  సిట్టింగ్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐదో విజయం కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి చేతిలో ఓడిపోయిన కంచర్ల భూపాల్‌ రెడ్డి ఈ సారి టీఆర్‌ఎస్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై కాంగ్రెస్, బీజేపీల నుంచి సీనియర్లే పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి ఆర్‌.దామోదర్‌ రెడ్డి, బీజేపీ నుంచి సంకినేని వెంకటేశ్వర్‌ రావు గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారే. ఈసారి మరో మారు ఈ ముగ్గురు నేతలూ  తలపడుతున్నారు. ఆలేరు బరిలో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోత్కుపల్లి నర్సింహులు కూడా అత్యధిక పర్యాయాలు విజయాలు సాధించిన నేతనే కావడం గమనార్హం. ఇక్కడనుంచి ప్రభుత్వ విప్‌గా పనిచేసిన గొంగిడి సునిత టీఆర్‌ఎస్‌ నుంచి, కాంగ్రెస్‌ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్‌ పోటీ పడుతున్నారు. ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల నుంచి పోటీ పడుతున్న నేతల్లో అత్యధికులు రెండో సారి, అంత కంటే ఎక్కువ సార్లు పోటీ పడుతున్న వారే.

అసెంబ్లీ బరిలోకి తొలిసారి
ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ బరిలోకి తొలిసారి దిగుతున్న వారు ఎక్కువ మందే ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు) ఎమ్మెల్యే పదవి కోసం తొలిసారి పోటీ పడుతున్నారు. భువనగిరి నుంచి కాంగ్రెస్‌ తరపున కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, హుజూర్‌నగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున ఎస్‌.సైదిరెడ్డి మొదటిసారి పోటీ పడుతున్నారు. బీజేపీ, బీఎల్‌ఎఫ్, సీపీఎం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నవారూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో నిలిచిన వారిలో అత్యధికులు సీనియర్లే కావడంతో పోటీ కూడా హోరా హోరీగా సాగనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు