చాతీ ఆసుపత్రిని తరలించొద్దు: తెలంగాణ వైఎస్సార్సీపీ

1 Feb, 2015 21:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పేద ప్రజలకు అందుబాటులో ఉన్న చాతీ ఆసుపత్రిని హైదరాబాద్ నుంచి మారుమూల ప్రాంతానికి తరలించొద్దని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఆసుపత్రి అన్నివర్గాలకు, పేదలకు అందుబాటులో ఉందని ఈ సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఆసుపత్రి తరలింపును అడ్డుకోనున్నట్టుగా ప్రకటించారు.

చాతీ ఆసుపత్రిని పార్టీ బృందం సోమవారం సందర్శించనున్నట్టుగా పార్టీ ప్రధానకార్యదర్శి శివకుమార్ వెల్లడించారు. ఈ బృందంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు ఉంటారని చెప్పారు. చాతీ ఆసుపత్రిని తరలించొద్దని, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న మౌళిక వసతులను ఉపయోగించుకుని అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పోరాటాలు వంటివాటిపై చర్చించడానికి పార్టీ గ్రేటర్ కమిటీ సమావేశం కూడా అవుతున్నట్టుగా చెప్పారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, గ్రేటర్, రాష్ట్ర నాయకులు ఈ సమావేశానికి హాజరవుతారని శివకుమార్ వివరించారు.

రాష్ట్ర కమిటీ సమావేశంలో పార్టీ ప్రధానకార్యదర్శులు శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, గున్నం నాగిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు బి.రవీందర్, అధికారప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు ప్రపుల్లా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.జయరాజ్, కార్యదర్శులు అమృతా సాగర్, మహీపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి, కార్యక్రమాల సమన్వయకర్త సిద్ధార్థ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు