ఆ పదకొండు.. 

4 Jan, 2019 13:17 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేగుంట నగరపంచాయతీలో విలీనం చేసిన  పదకొండు గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కొంత మంది నాయకులు నగరపంచాయతీని  కొనసాగించాలని, మరికొందరు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నిర్ణయంపై కోర్టు స్టేటస్‌కో ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ దఫా ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం రిజర్వేషన్లను ప్రకటించింది. మూడో విడతలో ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై కోర్టు ఏం తీర్పు ప్రకటిస్తోందోనని   ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

సాక్షి, మెదక్‌: చేగుంట మండలంలోని పదకొండు పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది. గత పంచాయతీ ఎన్నికలకు దూరమైన ఈ గ్రామాల్లో ఈ దఫా అయినా ఎన్నికలు జరుగుతాయా? అన్న అంశం రాజకీయవర్గాలు, ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. చేగుంట నగర పంచాయతీ ఏర్పాటు కోసం సమీపంలోని పది గ్రామాలను విలీనం చేసిన విషయం తెలిసిందే. చేగుంట నగర పంచాయతీ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు వీలుగా  ఆ పదకొండుగ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించారు.

అలాగే మూడో విడతలో ఈ ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎన్నికల షెడ్యూల్లో పేర్కొన్నారు. అయితే తాజాగా  చేగుంట నగర పంచాయతీగా కొనసాగించాలని కోరుతూ స్థానిక నాయకుడు మరోమారు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందోనని స్థానికులు, సర్పంచ్‌ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2013లో ఈ గ్రామాల్లో గ్రామసభల తీర్మానాలతో చేగుంట పరిసర గ్రామాలను కలుపుకొని నగరపంచాయతీగా ఏర్పాటు చేశారు. అదే ఏడాది జులైలో నగరపంచాయతీ పరిపాలన ప్రారంభించగా చేగుంట, రెడ్డిపల్లి, వల్లూర్, చిట్టోజిపల్లి, రుక్మాపూర్, ఉల్లితిమ్మాయిపల్లి, అనంతసాగర్, కర్నాల్‌పల్లి, చిన్నశివునూర్, వడియారం, పొలంపల్లి గ్రామాలు నగరపంచాయతీ పరిధిలోకి వచ్చాయి. నగరపంచాయతీ పరిపాలన కమిషనర్‌ల ఆధ్వర్యంలో నిర్వహించారు.

హైకోర్టు స్టేటస్‌కో..
తెలంగాణ ఏర్పాటు అనంతరం చేగుంట, రెడ్డిపల్లి, వడియారం గ్రామాల ప్రజలు నగరపంచాయతీని రద్దు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  అయితే స్థానిక నాయకులు 12 మంది మాత్రం చేగుంట నగర పంచాయతీని కొనసాగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.  2015 ఫిబ్రవరి 23న ఈ నగర పంచాయతీపై హైకోర్టు స్టేటస్‌కో విధించింది. తుదితీర్పు వెలువడే వరకు నగరపంచాయతీ పరిధిలోని గ్రామాలను ప్రత్యేక అధికారులను నియమించి పాలన జరపాలని సూచించింది. అప్పటి నుంచి  ఇప్పటివరకు 11 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.

ఇటీవల పంచాయతీ ఎన్నికల కోసం చేగుంటతోపాటు 10 విలీన గ్రామాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు ప్రకటించారు. తాజాగా చేగుంటకు చెందిన స్థానిక నాయకులు మరోమారు బుధవారం  హైకోర్టును ఆశ్రయించారు. గురు, శుక్రవారాల్లో కోర్టు సెలవు ఉందని శనివారం నగరపంచాయతీ అంశంపై విచారణ చేసే అవకాశం ఉందని స్థానిక నాయకుడు గణేశ్‌ తెలిపారు. దీంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి హనోక్‌ వివరణ కోరగా నిబంధనల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయటంతోపాటు ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్‌ ప్రకటించామన్నారు.  స్టేటస్‌కో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, 11 పంచాయతీల ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టు సూచనకు అనుగుణంగా నడుచుకోవటం జరుగుతుందన్నారు.

మరిన్ని వార్తలు