చీఫ్‌విప్‌గా నల్లాల ఓదెలు

12 Jun, 2014 05:42 IST|Sakshi
చీఫ్‌విప్‌గా నల్లాల ఓదెలు

డిప్యూటీ స్పీకర్‌గా పద్మ ఏకగ్రీవమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వ చీఫ్‌విప్‌గా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌ను విప్‌గా నియమించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. చీఫ్‌విప్‌గా ఏనుగు రవీందర్ రెడ్డి, జలగం వెంకట్రావు తదితరుల పేర్లను అనుకున్నప్పటికీ వారు విముఖత వ్యక్తం చేశారు. దీనితో నల్లాల ఓదెలుకు ఈ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు.

నామినేషన్ దాఖలు చేసిన పద్మ..
 ఇదిలాఉండగా, డిప్యూటీ స్పీకర్  పదవికి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి ఆమె తన నామినేషన్‌ను శాసనసభా కార్యదర్శి ఎన్.రాజాసదారాంకు అందించారు. బుధవారం సాయంత్రంతో నామినేషన్ గడువు ముగిసే సమయానికి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీనితో డిప్యూటీ స్పీకర్‌గా పద్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనసభలో గురువారం ప్రకటించనున్నారు. నామినేషన్ దాఖలు తరువాత స్పీకరు ఎస్.మధుసూదనాచారిని పద్మా దేవేందర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.

మరిన్ని వార్తలు