సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు 

3 Jun, 2019 07:06 IST|Sakshi
వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, సండ్ర, మాట్లాడుతున్న శ్రీనివాస యాదవ్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఇందుకోసం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు రూ.10వేల కోట్లతో శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన అడుగులు వేయగలిగామని, రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హుల చెంతకు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఐదేళ్లలో బలమైన పునాదులు పడ్డాయన్నారు.

రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ ఉండేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. గతంలో నెలకొన్న సమస్యల వలయం నుంచి బయటపడడమే కాకుండా.. నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడకు వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి.. తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తమవడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సృష్టించిన సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికన సమస్త ప్రజానీకానికి చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనలతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు.
 
‘రైతుబంధు’ ఆనందాన్ని నింపింది..  
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి.. రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని, దీంతో రైతుల మోములో ఆనందాన్ని చూడగలుగుతున్నామన్నారు. రైతులకు రుణమాఫీ, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా, పంట పెట్టుబడి కింద తొలకరికి ముందే ఏడాదికి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టామని వివరించారు. జిల్లాలో 2,67,202 మంది రైతులకు మొదటి విడతగా.. రూ.257.75కోట్లు అందించినట్లు తెలిపారు. రబీకి సంబంధించి ఇప్పటివరకు 2,47,835 మంది రైతులకు.. రూ.250.53కోట్లు అందించామన్నారు.

భూ రికార్డుల నవీకరణలో భాగంగా జిల్లాలో 9.57 లక్షల ఎకరాల భూముల రికార్డులు ఆధునికీకరించారని చెప్పారు. 380 రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించారని, పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీలో భాగంగా రెండు విడతల్లో 2,71,574 పాస్‌ పుస్తకాలను రైతులకు అందించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో చాలామంది సన్న, చిన్నకారు రైతులు ఉన్నారని, పేద రైతులు చనిపోతే ఆ కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయన్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి.. రైతుకు బీమా పట్టా అందిస్తున్నట్లు తెలిపారు. రైతుకు రూ.5లక్షల బీమా కల్పించి.. వారు కోరుకున్న వారినే నామినీలుగా చేర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితిలు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు వివరించారు.

2,464 ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం పూర్తి..  
డబుల్‌ బెడ్‌రూం పథకం అమలులో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకు 14,560 గృహాలు మంజూరు కాగా.. ఇప్పటివరకు 6,397 గృహాల పనులు చేపట్టి.. 2,464 గృహాల సముదాయాలను పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 750 గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక రోడ్ల నిర్మాణం, విస్తరణ కోసం సమగ్ర విధానంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో రూ.43కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లను రెండు వరుసల రహదారులుగా విస్తరింపజేశామన్నారు. అలాగే రెండు వరుసల రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించేందుకుగాను.. రూ.165కోట్లు ఖర్చు చేశామని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.213కోట్లతో 58 పనులు చేపట్టామన్నారు. జిల్లాలో రూ.120కోట్లతో 17 వంతెనలు, చెక్‌డ్యాంలు, రూ.77కోట్లతో ధంసలాపురం వంతెన పనులు పురోగతిలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. సీఆర్‌ఎఫ్, ఎస్‌సీఎస్‌డీఎఫ్, ఎస్‌టీఎస్‌డీఎఫ్‌కు సంబంధించిన పనుల్లో భాగంగా జిల్లాలో రూ.438కోట్లతో 127 పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
 
అధునాతన వైద్య సేవలు..  
ప్రజలకు ఆధునిక పరిజ్ఞానంతో అధునాతనమైన వైద్య విధానంతో మెరుగైన వైద్య సేవలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ద్వారా ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆస్పత్రుల్లో అందిస్తున్న మెరుగైన వైద్య సేవలు, పరిశుభ్రతకుగాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా పెద్దాస్పత్రికి రెండుసార్లు కాయకల్ప అవార్డు లభించిన విషయం అందరికీ తెలుసన్నారు. మహిళ గర్భవతి అయినప్పటి నుంచి ప్రసవం జరిగి.. తల్లీ–బిడ్డను ఇంటికి చేర్చే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్ల ద్వారా ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలు పెరిగాయన్నారు.

ఈ ఏడాది 8,863 కేసీఆర్‌ కిట్లను అందించినట్లు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో నూతన ఒరవడిని సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో నాణ్యమైన బోధనతోపాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు స్కూల్‌ డ్రెస్, పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా 2019 మార్చి వార్షిక పరీక్షల్లో 92.43 శాతం ఫలితాలను సాధించినట్లు గుర్తు చేశారు. వయోజన విద్యలో భాగంగా జిల్లాలో 15 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న 2వేల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించి.. వీరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
 
విద్యుత్‌ రంగంలో ప్రగతి.. 
విద్యుత్‌ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనూహ్య ప్రగతి సాధించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.29కోట్లతో 13 (33/11కేవీ) సబ్‌స్టేషన్ల పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యుత్‌ వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.17.58కోట్లు విడుదల చేశామన్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి కోసం రూ.125లకే విద్యుత్‌  కనెక్షన్లు అందించామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. 2018–19లో రూ.137కోట్లతో 71 నూతన పరిశ్రమలను స్థాపించామని, తద్వారా 1,235 మందికి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 332 గొర్రెల పెంపకం సహకార సంఘాలను ఏర్పాటు చేసి.. 34,258 మంది సభ్యులను నమోదు చేశారని తెలిపారు. ఇప్పటివరకు 15,357 మంది లబ్ధిదారులకు 75 శాతం రాయితీపై రూ.143.97కోట్లతో గొర్రెల యూనిట్లను అందించినట్లు తెలిపారు.

వీటితోపాటు ఉద్యానవన,, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు తెచ్చి.. పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఇక ఖమ్మం నగర ప్రజల అవసరాలకనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, 2017–18లో నగరంలో దాదాపు రూ.17.65కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో రూ.101.44కోట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. నగరంలోని లకారం చెరువును రూ.4కోట్లతో సుందరంగా తీర్చిదిద్ది.. ప్రజలకు ఆహ్లాద వాతావరణం కలిగించే ప్రాంతంగా మార్చామన్నారు.

రూ.56కోట్లతో గోళ్లపాడు చానల్‌ ఆధునీకరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. తొలుత నగరంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించి, బైపాస్‌ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఖమ్మం, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖమర్, నగర పాలక సంస్థ మేయర్‌ పాపాలాల్, కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్, సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్, జేసీ అనురాగ్‌ జయంతి, అసిస్టెంట్‌ కలెక్టర్లు హన్మంతు కొడింబా, ఆదర్శ్‌ సురభి, జెడ్పీ సీఈఓ ప్రియాంక, కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.శ్రీనివాసరావు, డీఆర్వో శిరీష, కలెక్టరేట్‌ ఏఓ మదన్‌గోపాల్, డీఆర్‌డీఓ బి.ఇందుమతి, ఖమ్మం రూరల్‌ తహసీల్దార్‌ అశోక్‌ చక్రవర్తి, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ పోరాటయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా