వాటర్‌గ్రిడ్‌కు 5వేల ఎకరాల భూమి?

24 Dec, 2014 03:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న తాగునీటి గ్రిడ్‌కు ఐదువేల ఎకరాల మేరకు భూ సేకరణ చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 26 గ్రిడ్‌ల నుంచి జిల్లాల్లో వేసే ప్రధాన ట్రంక్‌లైను, సబ్ ట్రంక్‌లైనులకు సంబంధించి ఈ భూమి అవసరం అవుతుందని చెబుతున్నారు. సాధారణంగా రహదారుల పక్క నుంచే ఈ మంచినీటి పైపులైన్లు వేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ.. దాదాపు పదిశాతం మేరకు ప్రైవేట్ భూములు సేకరించాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు.
 
 పైపులైను వేసే ప్రాంతంలో పదిమీటర్ల మేరకు భూ సేకరణ చేయాల్సి ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ అధికారులు చెబుతున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం 26 గ్రిడ్‌ల నుంచి జిల్లాకేంద్రాలు, ప్రధానప్రాంతాల నుంచి వెళ్లే ప్రధాన ట్రంక్‌లైను పొడవు ఐదు వేల కిలోమీటర్లు ఉంటుందని, అలాగే ఆ ప్రధాన ట్రంక్‌లైను నుంచి సబ్ ట్రంక్‌లైన్లు 45 వేల కిలోమీటర్ల పొడవు నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల పొలిమేరల వరకు వేయనున్నారు.
 
 ప్రధాన ట్రంక్‌లైను, సబ్‌ట్రంక్‌లైన్ల నుంచి బల్క్‌గా గ్రామాల పాయింట్ వరకు సరఫరా చేస్తారు. అటు నుంచి గ్రామాల్లో పంపిణీ చేసే మంచినీటి పైపులైను కూడా కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ద్వారానే వేయనున్నారు. ఇది దాదాపు 65 వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అధికారులు వివరించారు. ఒక గ్రామానికి అవసరమైన నీటిని లెక్కించి ఆ మేరకు సరఫరా చేస్తామని, ఇందుకోసం గ్రామ పాయింట్ వద్ద మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మీటర్ రీడింగ్ ఆధారంగా ఆ గ్రామం నుంచి నీటి ఛార్జీలను వసూలు చేయనున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఒక్కోగ్రిడ్ సర్వే పనులు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటి వరకు ఐదువేల కిలోమీటర్ల మేరకు సర్వే పూర్తిచేసినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు