కొంచెం ఇష్టం కొంచెం కష్టం

31 May, 2015 04:52 IST|Sakshi
కొంచెం ఇష్టం కొంచెం కష్టం

తెలంగాణ @ ఏడాది
ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ ప్రజలు పరాయి పాలనలో అష్టకష్టాలు పడ్డారు. భూమిపై, వనరులపై హక్కు కోల్పోయి బానిస బతుకులు బతికారు. ఈ క్రమంలో ‘మనమంతా ఏకమవుదాం. మన రాష్ట్రం మనం సాధించుకుందామంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు.., వేలు, లక్షల ప్రజల్లో ఆశ రేపింది. ఒక్కొక్కరు వేలు, లక్షలై కదిలారు. అనుకున్నది సాధించుకున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇంత వరకు బాగానే ఉన్నా..

ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమలు నోచుకో లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కేసీఆర్ పాలన ‘కొంచెం ఇష్టం...కొంచెం కష్టం’గా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.                             - నిజామాబాద్ అర్బన్

 
కేసీఆర్ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం  
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
వేడుకలకు సన్నద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం
హామీలు అమలు అంతంతే  నైరాశ్యంలో ప్రజలు

 
రుణమాఫీపై కొర్రీలు
భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కేసీఆర్ మొదట రైతుల రుణ మాఫీ అంశంపై నెల రోజుల పాటు తర్జన భర్జన పడ్డారు. ఎట్టకేలకు రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన రైతులకు సంబంధించిన 1786 కోట్ల 96 లక్షల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యూయి. ఇంతవరకు బాగానే ఉన్నా తొలి విడతగా 25 శాతం మాత్రమే రుణాలు మాఫీ చేశారు.

దీంతో జిల్లాకు 446 కోట్ల 74 లక్షలను ప్రభుత్వం జిల్లాకు కేటాయించింది. వీటిలో సరైన ఆధారాలు చూపిన 3 లక్షల 98 వేల మంది రైతులకు 401 కోట్ల 30 లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశారు. దీంతో చిన్న చిన్న లోపాలు ఉన్న రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రుణమాఫీ డబ్బులు మొత్తం చెల్లించకపోవడంతో బ్యాంకర్లు కొత్త రుణాలు ఇచ్చేందుకు రైతును ఇబ్బందికి గురిచేస్తున్నారు.
 
పాత రుణం తీర్చితేనే కొత్త రుణం అని నిక్కచ్చిగా చెబుతున్నట్టు రైతులు వాపోతున్నారు. మిగిలిన రుణమాఫీ సొమ్మును త్వరలో రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించినా, ఇప్పటి వరకు జమచేయలేకపోయూరు.
 
కల్యాణ లక్ష్మి, షాదీ ‘ముబారక్’
సమాజంలో ఆడపిల్ల అంటేనే భారంగా భావించే తల్లిదండ్రులకు గొప్ప వరంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు.  ఆడపిల్లల పెళ్లి చేయూలంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం కుటుంబాల కోసం ప్రభుత్వం ఈ పథకాలను రూపొందించింది. పెళ్లి సమయంలో వీరికి రూ. 51 వేలు అందజే స్తారు. ఇందులో భాగంగా జిల్లా నుంచి 96 దరఖాస్తులు రాగా, 61 మందికి  51 వేల రూపాయల చొప్పున 31 లక్షల 11 వేలు మంజూరు చేశారు.

ఇంకా 35 పరిశీలనలో ఉన్నాయి. షాదీ ముబారక్‌లో 244 దరఖాస్తులు రాగా, 30 మందికి 51 వేల రూపాయల చొప్పున 15 లక్షల 30 వేలు మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలుకు అధికారులు కాస్త చొరవ చూపుతున్నట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే స్పందించి పెళ్లి సమయూనికి డబ్బులు అందేలా కృషి చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.
 
మిషన్ కాకతీయ
కాకతీయుల కాలం నాటి చెరువులు ఆంధ్ర పాలకుల పాలనలో నిరాధరణకు గురయ్యూరుు. వీటికి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ‘మిషన్ కాకతీయ’ను ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. జిల్లాలో 3251 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటి దశలో 20 శాతం చెరువుల్లో పునరుద్దరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ, చెరువులు సర్వే చేసి దశల వారీగా ప్రభుత్వం అనుమతి పంపడానికే నెలల కొద్దీ సమయం పట్టింది.

పరిపాలన అనుమతి ఇవ్వడంలోనూ జాప్యం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ప్రస్తుతం జిల్లాలో 661 చెరువులకు మాత్రమే అనుమతి లభించింది.  వీటిలో 519 చెరువుల్లో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన 142 చెరువుల పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇలా అయితే వేల సంఖ్య లో ఉన్న చెరువులు పూర్తవ్వాలంటే మరో ఐదేళ్ల సమయం కావాల్సిందే అని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.
 
ఆసరా పింఛన్ల గోస
గత ఏడాది నవంబర్‌లో ఆసరా పింఛన్ పథకం ప్రారంభించారు. పథకం ప్రారంభానికి ముందు చేపట్టిన సకల జనుల సమ్మెతో చాలా మంది పింఛన్ దారులను అనర్హులుగా గుర్తించారు. అర్హులకే పింఛన్ వర్తించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత కార్మికులు మొత్తం 3 లక్షల 86 వేల 544 మందికి నెలకు వెయ్యి చొప్పున పింఛన్లు పింఛన్లు, వికలాంగులకు నెలకు రూ. 1500 చొప్పున పంపిణీ చేస్తున్నారు.

ఇంకా ఎవరైనా పింఛన్ రాని వారు అన్ని అర్హతలు కలిగి ఉంటే విచారణ చేపట్టి మంజూరు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. వీరితో పాటు బీడీ కార్మికుల కోసం జీవన భృతి పింఛన్ పథకం ప్రవేశపెట్టారు. ఇందులో 2,70,633 మంది బీడీ కార్మికులు ఉండగా, 1,14,208 మంది జీవన భృతి పొందుతున్నారు.

అయితే, వీరికి పింఛన్ మంజూరు చేయడానికి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో చాలా మందిని అనర్హులుగా గుర్తించారు. ఈ అంశంపై చాలా చోట్ల నిరసనలు, ధర్నాలు నేటికీ కొనసాగుతున్నారుు. అధికారులు మాత్రం దరఖాస్తు చేసుకుంటే అర్హులకు పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నారు.
 
నల్లా నీళ్లొచ్చేనా..?
ప్రతి ఇంటికి నల్లా’ హామీలు పకడ్బంధీగా అమలు చేసేందుకు ‘వాటర్‌గ్రిడ్’ను పనులు చేపట్టారు. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి జిల్లాను రెండు సెగ్మెంట్లుగా విభజించారు. ఒక సెగ్మెంట్‌కు సింగూర్  జలాశయం నుంచి 16 మండలాలకు రూ. 1710 కోట్ల అంచనా వ్యయంతో , రెండో సెగ్మెంట్‌కు శ్రీరాంసాగర్ జలాశయం నుండి 20 మండలాలకు రూ.1765 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం సర్వే పనులు జరుగుతున్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు పనులు ప్రారంభించారు. అదేవిధంగా పట్టణ తాగునీటి సరఫరా ద్వారా నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణంలో తాగునీరు సదుపాయాల గురించి 4 పనులను రూ. 232 కోట్ల 47 లక్షల వ్యయం తో చేపట్టగా నిజామాబాద్ పట్టణానికి సం బంధించిన పనులు పూర్తయ్యూయి.

ఈ పథకం అమలుకు కేసీఆర్ తీవ్ర కృషి చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే వచ్చే ఎన్నికలో ఓటు అడుగను అని నిక్కచ్చిగా చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే సాధారణ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా వచ్చేలా ఉందని పలు గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 
భూమి ఎప్పుడిత్తరో..!
భూమి లేని నిరుపేద దళితులకు వ్యవసాయూధారిత మూడెకరాల భూమి పంపిణీ చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూమిని కొనుగోలు చేసేందుకు సమాయత్తమైంది. పంపిణీ చేసిన భూమిలో బోరు, మోటారు, కరెంటు కనెక్షన్ లాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మొదటి ఏడాది పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెడుతుందని, సదరు భూముల్లో భూసార పరీక్షలు, భూగర్భ జల పరీక్షలు జరుపుతామని అధికారులు పేర్కొన్నారు.

కానీ, ఇప్పటి వరకు జిల్లాలో 16 మందికి మాత్రమే 48 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. అర్హులైన వారు ఎంతో మంది ఉన్నా వారిని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యూరనే ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆవిర్భావ వేడుకల్లోనైనా అర్హులైన దళితులను గుర్తించి వారికి భూమి పంపిణీ చేయూలని పలువురు దళిత నేతలు కోరుతున్నారు.
 
కేసీఆర్ ప్రధాన హామీలు:-
రైతుల రుణాలు మాఫీ
వృద్ధులు, వికలాంగుల పింఛన్ పెంపు
బీడీ కార్మికులకూ పింఛన్
ఇంటింటికి నల్లా
పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు
కేజీ టు పీజీ ఉచిత విద్య
దళితులకు మూడెకరాల భూమి

మరిన్ని వార్తలు