కిరోసిన్ హాకర్ దారుణహత్య | Sakshi
Sakshi News home page

కిరోసిన్ హాకర్ దారుణహత్య

Published Sun, May 31 2015 4:47 AM

Brutal murder

ఆస్తి వివాదాలే కారణం
మనవరాలి భర్తే గొడ్డలితో నరికి చంపాడు
హత్య ఘటనతో భీతిల్లిన స్థానికులు
లొంగిపోయిన నిందితుడు?
 

 తాడికొండ : నియోజకవర్గ కేంద్రమైన తాడికొండలో ఎన్నడూలేని విధంగా పట్టపగలు వృద్ధుడని కూడా చూడకుండా కర్కశంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన శనివారం చోట్టుచేసుకొంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో మనవరాలి భర్తే హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు భీతిల్లారు. హతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .. గ్రామానికి చెందిన కుంభా కోటేసు (80) ఎన్నో ఏళ్లుగా  కిరోసిన్ హాకరుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఆయనకు నాలుగెకరాలు పొలం కూడా ఉంది.

గతంలో ఎకరం రూ.10 లక్షలు ఉండేది. రాజధాని ప్రకటన నేపథ్యంలో ఎకరం రూ.30 లక్షల వరకు ధర పలుకుతోంది.  ఆస్తి విలువలు భారీగా పెరగడంతో కుటుంబాల్లో వివాదాలు చెలరేగాయి. కోటేసుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కూతురు సంతానానికి పొలం పెట్టారని, కొంత కాలం నుంచి కోటేసు కుటుంబీకులకు మధ్య ఆస్తి విషయంలో వివాదం నెలకొంది.

ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఎండల తీవ్రతకు స్థానిక రావిచెట్టు సెంటరు సమీపంలో ప్రధాన రహదారిలో చెట్టు కింద కోటేసు కూర్చుని సేద తీరున్నారు. కొంతసేపటికి మనుమరాలి భర్త పాలపర్తి శ్రీనివాసరావు బైకుపై వచ్చి చెట్టుకింద కూర్చున్న కోటేసును గొడ్డలితో తలపై, మెడపై నరకడంతో రక్తం చింది పక్కనున్న ప్రహరీపై పడి అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే నిందితుడు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హతుడు కోటేసు పైసాపైసా కూడబెట్టి వృద్ధాప్యంలోనూ కిరోసిన్ అమ్ముకుంటూ జీవించేవారు. ఈ ఘటనను బట్టి ఆస్తిని కూడబెట్టడమే అతనికి శాపమైంది.

సమాచారం అందుకున్న బంధువులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహం వద్ద భోరున విలపించారు. ఎస్‌ఐ జె.అనూరాధ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడి బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కోటేసు.. తన కుమారుడి పిల్లలకు ఆస్తి పెట్టకుండా కుమార్తె పిల్లల పేర పెట్టాడనే కక్షతో హత్యాఘటన చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. నిందితుడు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తన మనవరాలినిచ్చి శ్రీనివాసరావుకు వివాహం చేసింది కోటేసేనని, ప్రస్తుతం భార్యాభర్తల మధ్య వివాదాలు రావడంతో ఆ కక్షతోనే కోటేసును హత్యచేసి ఉంటాడని స్థానికులు అంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement