ఫంక్షన్ హాళ్లే అతడి టార్గెట్

21 Jan, 2016 02:20 IST|Sakshi

చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
 
వరంగల్ క్రైం : కల్యాణ మండపాల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని వరంగల్ కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.2.50 లక్షల విలువైన 93 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఏసీపీ ఈశ్వర్‌రావు కథనం ప్రకారం.. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన గట్టికొప్పు ల చంద్రమౌళి డిగ్రీ చదువును మధ్యలోనే ఆపివేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ ఉప్పల్ రామాంతపూర్‌లోని జెర్సీ మిల్క్‌డైరీలో ఏడాది పాటు పనిచేశాడు. ఇదే సమయంలో అతడు తాగుడు, జల్సాలకు అలవాటుపడి ఉద్యోగానికి గైర్హాజర్ కావడంతో యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో అతడు స్వగ్రామానికి చేరుకుని తొలుత 2015, నవంబర్‌లో హం టర్ రోడ్డులోని కడెం కల్యాణ మండపంలో వివాహం జరుగుతున్న సమయంలో నిందితుడు ఓ చిన్నారి మెడలో 18 గ్రాముల బంగారు ఆభరణాన్ని అపహరించాడు. డిసెంబర్ లో ఇదే కళ్యాణ మండపంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లోని 45 గ్రాముల రెండు బంగారు నల్లపూసల గొలుసులతోపాటు ఒక సెల్‌ఫోన్‌ను చోరీకి పాల్పడ్డాడు.
 అలాగే నవంబర్‌లో పెళ్లి ఊరేగింపు లో ఓ మహిళ మెడలో నుంచి 30 గ్రాముల బం గారు ఆభరణాన్ని చోరీ చేశాడు.

ఇలా చోరీలకు పాల్పడిన నిందితుడు చోరీ సొత్తును వరంగల్ బులియన్ మార్కెట్‌లో అమ్మేందు కువచ్చినట్లుగా కచ్చితమైన సమాచారం రావడంతో క్రైం ఏసీపీ కె.ఈశ్వర్‌రావు ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్ తన సిబ్బందితో వెళ్లి నింది తుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా నిందితుడు వద్ద బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. పోలీసుల విచారణలో తాను చేసిన నేరాలను వెల్లడించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషిచేసిన ఇన్‌స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై బి.సుమన్, హెడ్‌కానిస్టేబుళ్లు, టి.వీరస్వామి, కె.శివకుమార్, కానిస్టేబుళ్లు మహేశ్, జంపయ్య, రాజును క్రైం ఏసీపీ అభినందించారు.
 
 

మరిన్ని వార్తలు