తవ్వేయ్.. తరలించేయ్

23 Sep, 2014 23:24 IST|Sakshi
తవ్వేయ్.. తరలించేయ్

 తాండూరు: యాలాల కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా ‘మూడు డంప్‌లు-ఆరు ట్రాక్టర్లు ’అన్న చందంగా యథేచ్ఛగా సాగుతోంది. రెవెన్యూ,పోలీసు అధికారుల పూర్తి స్థాయి నిఘా లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కాగ్నా నదిలో ఇసుక తవ్వకాలపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు ఈ దందాను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇసుక అక్రమరవాణాకు పాల్పడే వారిపట్ల చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పినా సంబంధిత అధికారుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. చోటామోటా నాయకులు ట్రాక్టర్ల ద్వారా కాగ్నా నుంచి ఇసుకను తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిపూట లారీల్లో తాండూరు సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లాకు రవాణా చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే రెవెన్యూ,పోలీసు అధికారులు కేసులు,జరిమానాలు వేస్తున్నా పూర్తి స్థాయి చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావి స్తోంది.

 కాగ్నా నది నుంచి ఇసుకను తీసుకువచ్చి కోకట్, లక్ష్మీనారాయణపూర్, యాలాల తదితర గ్రామాల సమీపంలోని రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. ఇటీవల స్థానికుల సమాచారం తో అధికారులు పెద్ద ఎత్తున ఇసుక డం ప్‌ను సీజ్ చేయడమే ఇందుకు ఉదాహరణ.  నిరంతరం తనిఖీలు చేస్తే ఇలాంటి డంప్‌లు మొత్తం బయటపడతాయని సా ్థనికులు అంటున్నారు.  కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇసుక దందాలో భాగస్వామ్యం కావడం గమనార్హం.  ఇసుక డంప్‌లపై రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  రెండు,మూడు డంప్‌లను సీజ్ చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యాలాల చుట్టుపక్కల, తాండూరు పట్టణ శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తే ఇసుక డంప్‌లు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు.  కొందరు అధికారులు నెలవారీ ముడుపుల మత్తులో మునిగిపోవడంతో డంప్‌ల జోలికి వెళ్లడం లేదని సమాచారం.

ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు ఎక్కడ ఉన్నాయో...అసలు పని చేస్తున్నాయో లేదో తెలియని పరిస్థితి.  పట్టణంలోని పాతతాండూరు మీదుగా ఇసుక రవాణా సాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక అక్రమ తరలింపుతో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం  వెనుక భాగంలో కాగ్నా నది ధ్వంసమైంది.

నంబర్లు లేని ట్రాక్టర్లను అక్రమార్కులు ఇసుక రవాణాకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ట్రాక్టర్లపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోకపోవడం కూడా ఇసుక అక్రమ రవాణాకు ఊతమిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజుకు సుమారు 150-200ల ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని తెలుస్తోంది. జిల్లా అధికారులు చొరవ తీసుకుంటే తప్ప ఇసుక దందాకు బ్రేక్ పడే పరిస్థితి కనబడటం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు