రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు.. సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

25 Nov, 2023 07:55 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది. భిన్న కులమతాలు, వర్గాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంపొందించే విధంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘననే అని స్పష్టం చేసింది. ఇకపై అలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని హితవు పలికింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యకార్యదర్శి అవినాష్‌ కుమార్‌ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అడ్వైజరీ జారీ చేశారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడిపై స్పందిస్తూ గత నెల 30న నిజామాబాద్‌ జిల్లా బాన్స్‌వాడలో చేసిన ఎన్నికల ప్రసంగంలో కేసీఆర్‌ రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఈసీ విచారణకు ఆదేశించింది. స్థానిక రిటర్నింగ్‌ అధికారి విచారణ చేసి ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. దీంతో ఇకపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఈసీ అడ్వైజరీ జారీ చేసింది.  
చదవండి: తెలంగాణ రాజకీయాల్లో ‘డ్రామా’ లేదు: రాంగోపాల్‌వర్మ

మరిన్ని వార్తలు