ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ..!

1 Jun, 2014 03:05 IST|Sakshi

 గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహిళల సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్న ఇందిరాకాంత్రి పథం ఉద్యోగులకు ఏళ్లు గడిచినా వెట్టిచాకిరీ మాత్రం తప్పడం లేదు. కనీస వేతన చట్టం వీరికి అమలు చేయకపోవడంతో చాలీచాలని జీతంతో కుటుంబాల్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.
 
 పథకం రూపురేఖలు మారినా...

 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వెలుగు పథకం రూపురేఖలు మారిపోయాయి. వెలుగు పథకం కాస్త ఇందిరాక్రాంతి పథంగా మారిపోయింది. పథకంలో గతంలో పనిచేసిన ఎగువ స్థాయి సిబ్బంది అయిన డీపీఎం, ఏపీఎం, మండల సమన్వయ కర్తలకు హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేశారు. కానీ దిగువ స్థాయి సిబ్బంది అయిన కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలు నేటికి హెచ్‌ఆర్ పాలసీకి నోచుకోలేదు. మండల సమాఖ్య ఆధీనంలో పనిచేస్తున్న వీరికి అరకొర జీతభత్యాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నందున రేపోమాపో ఉద్యోగ భద్రత కల్పిస్తారేమో అని ఆశతో ఉద్యోగులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారు.
 
 పని భారం
 గ్రామ స్థాయిలో మహిళల వారం మీటింగుల సమాచారాన్ని సేకరించి ఒక్కో స్వయం సహాయక సంఘాల లెక్కల వివరాలు, సభ్యుల వివరాలు, ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు కంప్యూటర్‌లో పొందు పరుస్తూ అధికారులు కోరిన విధంగా వారికి రిపోర్టులు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ కార్యక్రమాల విధులు నిర్వహిస్తున్నారు. దీపం పథకం, స్త్రీనిధి, అమృతహస్తం, పావలా వడ్డీ, అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర ప్రభుత్వ ముఖ్య పథకాలను పేదల దరికి చేర్చడానికి వీరు నిరంతర కృషి చేస్తున్నారు.
 
 జిల్లా వ్యాప్తంగా..
 జిల్లాలో మొత్తం 647 మంది తాత్కాలిక ఉద్యోగులు మండల సమాఖ్యల పరిధిలో వారి సేవలందిస్తున్నారు. వీరిలో 567 మంది కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు వివిధ రకాల పని చేస్తుండగా వీరికి రూ.1200 నుంచి 2వేల వరకు జీతం అందిస్తున్నారు. కాగా మండల సమాఖ్య అకౌంటెంట్లు 18 మందికి రూ.3,500, 21 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. అటెండర్లు 18 మందికి రూ.2,500 చెల్లిస్తున్నారు. 12 మంది బ్యాంకు మిత్ర, నలుగురు బీమా మిత్రలకు బ్యాంకు లింకేజీ, క్లెయిముల ఆధారంగా వేతనం చెల్లిస్తున్నారు. క్లస్టరు యాక్టివిస్టులుగా, జాబ్ రిసోర్స్‌పర్సన్‌గా, డిజెబిలిటీ వర్కర్లుగా, మాస్టర్ బుక్ కీపర్లుగా ఏడుగురు పనిచేస్తుండగా వీరికి కొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. వారికిచ్చే ఆ కొంత కూడా నెలకు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు