చెట్టు లేకపోతే భవిష్యత్‌ లేదు

25 Sep, 2019 02:41 IST|Sakshi
అరణ్యభవన్‌లో జాదవ్‌ మొలాంగ్‌ను సన్మానిస్తున్న అటవీ శాఖ అధికారులు 

ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, పద్మశ్రీ జాదవ్‌ మొలాంగ్‌

సాక్షి, హైదరాబాద్‌: చెట్టు లేకపోతే మనకు భవిష్యత్‌ లేదన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఫారెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, పద్మశ్రీ జాదవ్‌ మొలాంగ్‌ పెయాంగ్‌ అన్నారు. ప్రకృతిని కాపాడితే, ఆ ప్రకృతే మనకు అన్నీ తిరిగి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన జాదవ్‌ మంగళవారం అరణ్యభవన్‌లో అధికారులతో సమావేశమై తన అనుభవాలు పంచుకున్నారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది జాదవ్‌ను ఘనంగా సన్మానించారు. అస్సాంకు చెందిన మొలాంగ్‌ బ్రహ్మపుత్ర నదీ తీరంలో వరదలతో కోతకు గురైన ప్రకృతి విధ్వంసాన్ని చూసి, 1979లో మొక్కలు నాటడం ప్రారంభించారు. సుమారు 550 హెక్టార్లలో అడవిని పెంచారు.

ఆయన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అదనపు పీసీసీఎఫ్‌లు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మొలాంగ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరాం, జీఎం (సీడీఎన్‌ అండ్‌ సీపీఆర్‌ఓ) ఆంటోని రాజా, అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏజీఎం మార్కెటింగ్‌ ఎన్వీకే శ్రీనివాస్‌రావు, డీజీఎంలు, ప్రజాకవి జయరాజు, ఇగ్నైటింగ్‌ మైండ్స్‌ సీఈవో కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు