నాలుగు నెలలైనా జీతాల్లేవ్‌! 

25 Aug, 2018 02:40 IST|Sakshi

     మే 1న కొలువులో చేరిన ఏఈవోలు... అప్పటి నుంచి వేతనాలివ్వని దుస్థితి 

     554 మంది ఏఈవోల ఆవేదన... విన్నవించినా స్పందించని అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: వారంతా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నియమితులైన వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవోలు). ఈ ఏడాది మే నెల ఒకటిన కొందరు ఏఈవోలుగా బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరితో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రైతు పథకాలను గ్రామాల్లో అమలు చేయాల్సిన కీలక బాధ్యత మీదేనని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని ఆయన వారికి ఉద్బోధించారు. దీంతో వీరంతా పెట్టుబడి చెక్కుల పంపిణీ, రైతు బీమా పథకం అమలు వంటి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఫలితంగా వారిని ప్రభుత్వం అభినందించిన సంగతి తెలిసిందే. అలాంటి ఏఈవోలకు కొలువులో చేరినప్పటి నుంచి (4 నెలలు) వేతనం రాకపోవడం గమనార్హం. మొత్తం 744 మంది నియమితులైతే, వారిలో 554 మంది ఇప్పటికీ జీతం అందుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.  

సొంత ఖర్చుతో రైతు బీమా అప్‌లోడింగ్‌... 
వ్యవసాయశాఖలో కిందిస్థాయిలో పనిచేసేది ఏఈవోలే. మండలంలో ఏవోలుంటే, మూడు లేదా నాలుగు పంచాయతీలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు. రైతులకు అవసరమైన పథకాలను అమలు చేసే కీలక బాధ్యత వీరిదే. వీరికి ప్రభుత్వం ట్యాబ్‌లు ఇచ్చింది. పెట్టుబడి చెక్కుల పంపిణీ సమాచారమంతా వారు ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారు. అంతేకాదు ఇటీవల రైతు బీమాలో దాదాపు 40 లక్షల మంది రైతులను వీరు కలిశారు. 27 లక్షల మంది రైతుల బీమా సమాచారమంతా కూడా ట్యాబ్‌ల ద్వారా అప్‌లోడ్‌ చేశారు.

విచిత్రమేంటంటే అధికారులు వీరికి జీతం ఇవ్వకపోగా, కనీసం ఇంటర్నెట్‌ కనెక్షన్‌కు సంబంధించిన డేటా కార్డునూ ఇవ్వలేదు. దీంతో చాలామంది సొంతంగానే కొనుగోలు చేసుకొని సమాచారాన్ని అప్‌లోడ్‌ చేశారు. సొంత ఖర్చులతోనే గ్రామాలు తిరిగి వచ్చారు. ఇంత చేసినా జీతాలివ్వకపోవడంపై ఏఈవోలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం అధ్యక్షుడు డి.శ్రీనివాసగౌడ్, కార్యదర్శి ఎ.ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు.  

మరిన్ని వార్తలు