దళితులపై ‘థర్డ్‌ డిగ్రీ’

18 Jul, 2017 17:12 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల దాష్టీకం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ప్రతాపం చూపించారు. రైతు భూమయ్యను ఇసుకలారీ ఢీకొన్న ఘటన తర్వాత జరిగిన ఇసుక లారీల దహనానికి బాధ్యులంటూ పోలీసులు కొందరిని పట్టు కెళ్లి థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో వారికి కనీ సం నోట మాట రావడం లేదు. పక్కటెము కలు విరిగిపోయాయి. గాయాలతో ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. గాయాలు చూసిన జైలర్‌ వారిని రిమాండ్‌కు తీసుకో కుండా వెనక్కి పంపించాడంటే.. బాధితుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఈనెల 2న నేరెళ్ల గ్రామ రైతు భూమయ్యను ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆగ్రహించిన స్థానికులు ఐదు ఇసుక లారీల కు నిప్పు పెట్టారు. అడ్డుకున్న తంగళ్లపల్లి ఎస్సై సైదారావుపైనా దాడి చేశారు. దీనికి సంబందించి 13 మందిపై పోలీసులు క్రిమిన ల్‌ కేసులు పెట్టారు. ఈనెల 4 రాత్రి బాణయ్య, హరీశ్, బాలరాజు, ఈశ్వర్‌కు మార్, గోపాల్, మహేశ్‌.. మరో ఇద్దరిని పోలీసులు తీసుకెళ్లినట్లు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని జిల్లా కేంద్రం లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో 4 రోజులు నిర్బంధించి, చితకబాదారు. థర్డ్‌డిగ్రీ ప్ర యోగించారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయి.  

మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు..
పోలీసుల దెబ్బలతో 8 మంది ఆస్పత్రిపాలు కావడంపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన ఎస్పీ విశ్వజిత్, సీసీఎస్‌ ఎస్సై రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు