హెరిటేజ్ సైట్‌గా రామప్ప

18 Apr, 2016 01:38 IST|Sakshi

చివరి క్షణంలో స్థానం కోల్పోరుున ఖిలా వరంగల్
యునెస్కో పరిశీలనలో ప్రతిపాదనలు
త్వరలో ఫ్రాన్స్ నుంచి {పతినిధుల రాక
నేడు వరల్డ్ హెరిటేజ్ డే

 

హన్మకొండ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న రామప్ప ఆలయ శిల్ప సంపద కీర్తి పతాకం  అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు హోదాకు బరిలో ఉన్న రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు   యునెస్కో ప్రతినిధులు త్వరలోనే వరంగల్ రానున్నా రు. యునెస్కో- వరల్డ్ హెరిటేజ్ సైట్స్ టెంటిటేవ్ లిస్ట్ లో ఇప్పటికే రామప్ప ఆలయానికి చోటు లభించిం ది. సోమవారం వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని ప్ర పంచ వారసత్వ సంపదగా రామప్ప ఆలయూనికి గుర్తిం పు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ప్రత్యేక కథనం.

 

మూడింటిలో ఒకటి..

కాకతీయుల కళావైభవానికి ప్రతీకలుగా నిలిచిన వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్, రామప్ప ఆలయాలకు ప్రపంచ వారసత్వ సంపద (వరల్డ్ హెరిటేజ్ సైట్) గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇటు ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు  నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా యునెస్కో హెరిటేజ్ సైట్స్ టెంటిటేటివ్ లిస్టులో 2014లో ఈ మూడు కట్టడాలకు చోటు దక్కింది. తర్వాత  ప్రక్రియలో భాగంగా ఈ కట్టడాల నిర్మాణ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యతలను వివరిస్తూ రూ. 20 లక్షల వ్యయంతో 2015 డిసెంబర్‌లో నివేదిక (డోసియర్) రూపొందించారు. దీనిపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంతృప్తి వ్యక్తం చేసింది. అరుుతే చారిత్రక కట్టడాల పరిరక్షణ విషయంలో యునెస్కో నిబంధనలు కఠినంగా ఉండటంతో జనావాసాల మధ్య ఉన్న వేయిస్తంభాల గుడి, ఖిలావరంగల్‌ను చివరి నిమిషంలో తప్పించారు. దీంతో రామప్ప ఆలయానికి సంబంధించిన పూర్తి చారిత్రక విశేషాలు, శిల్పాల విశిష్టతతో కూడిన తుది నివేదికను ఈ ఏడాది జనవరిలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఉన్న యునెస్కో ప్రధాన కార్యాలయంలో సమర్పించారు.

 
త్వరలో ప్రతినిధుల రాక..

రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం  యునెస్కోకు విజ్ఞప్తి చేసింది. నివేదిక అందిన తర్వాత ఆరు నెలల లోపు యునెస్కో ప్రతినిధులు వచ్చి రామప్ప ఆలయ విశిష్టత, దాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించాల్సి ఉంది. జనవరిలో నివేదిక సమర్పించిన నేపథ్యంలో యునెస్కో ప్రతినిధులు త్వరలోనే జిల్లాకు వచ్చి చారిత్రక కట్టడాలను పరిశీలిస్తారు. అనంతరం యునెస్కో ప్రమాణాలకు అనుగుణంగా రామప్ప ఆలయ ప్రత్యేకతలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.  వీటిపై యునెస్కో సంతృప్తి చెందితే ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తుంది. 

 
గుర్తింపు లభిస్తే అద్భుత ప్రచారం..

యునెస్కో నుంచి గుర్తింపు లభిస్తే కాకతీయులు నిర్మిం చిన అద్భుత కట్టడాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం లభిస్తుంది. ఈ కట్టడాల పరిరక్షణ, పరిసర ప్రాంతాల అభివృద్ధికి యునెస్కోతో పాటు కేంద్రం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థల నుంచి నిధుల ప్రవాహం ఉంటుంది. ఇందుకు కర్నాటకలో ఉన్న హంపిని ఉదాహరణగా తీసుకోవచ్చు. యునెస్కో గుర్తింపు తర్వాత హంపి శరవేగంగా అభివృద్ధి చెందింది. టూరిస్టుల సం ఖ్య నాలుగురెట్లు పెరిగింది. హోటళ్లు, టాక్సీలు, ఫుడ్‌కోర్టులు, గైడ్‌ల సంఖ్య పెరగడంతో యువతకు ఉపాధి అ వకాశాలు మెరుగయ్యాయి. అలాగే రామప్పకు గుర్తింపు లభిస్తే దాంతో పాటు జిల్లాలో ఉన్న ఇతర పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఐలోని, కొమురవెల్లి, మల్లూరు, మేడారం, ఏటూరునాగారం అభయారణ్యం, పాండవులగుట్ట, గణపురం సున్నపురాయి గుహలు, పెంబర్తి, చేర్యాల హస్తకళలన్నీంటిని కలిపి టూర్ సర్క్యూట్‌గా ఏర్పాటు చేయొచ్చు.

 

శిల్పాల్లోకి నేడు ఉచిత ప్రవేశం
ఖిలావరంగల్ :  హెరిటేజ్ డేను పురస్కరించుకుని చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణంలోకి సోమవారం పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు కేంద్ర పు రావస్తుశాఖ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన చేశారు. జంగయ్య గడిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగిస్తామని తెలిపారు. పర్యాటకులు, నగర ప్రజలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

 

మరిన్ని వార్తలు