నేడు ఓనమ్

7 Sep, 2014 00:47 IST|Sakshi

ఆదిలాబాద్(మామడ) : ఓనమ్.. కేరళ వాసులకు ఇష్టమైన పండుగ. పేద, ధనిక వర్గాల వారు సమానత్వానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఓనమ్ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. మళయాళం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల చింగంలో వస్తుంది. నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. కేరళలో పంటలు చేతికందే సమయంలో ఈ పండుగ నిర్వహిస్తారు. జిల్లాలోని చాలా పట్టణాల్లో కేరళవాసులు ఉన్నారు. ఈ పండుగను ఏటా వైభవంగా నిర్వహిస్తుంటారు.

ఆదివారం పండుగ నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది రోజులపాటు పండుగను వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు పూలతో ఒక వరుస, రెండో రోజు రెండు వరుసులు ఇలా పదో పది వరుసల పూలతో ముగ్గులు వేస్తారు. ఈ పది రోజుల్లో మొదటి రోజు ఆథంతోపాటు చివరి రోజు తిరువోనమ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

తిరువోనమ్ చివరి రోజు విందు భోజనాలను అరటి ఆకుల్లో ఏర్పాటు చేస్తారు. పాయసంతోపాటు 16 రకాల వంటలు వండుతారు. ఈ కార్యక్రమాన్ని ఓన సద్యగా పిలుస్తారు. మామడ మండలం పొన్కల్‌తోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, నిర్మల్ పట్టణాల్లో మళయాళీలు ఆదివారం ఓనమ్ పండుగకు ఏర్పాట్లు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు