ట‘మోత’ తగ్గట్లే

24 Jul, 2019 02:42 IST|Sakshi

కేజీ టమాటా రూ.50కి పైనే  

వర్షాభావ పరిస్థితులతో రాష్ట్రంలో తగ్గిన సాగు 

పొరుగు రాష్ట్రాల నుంచి దిగుబడి అంతంతే 

క్యాప్సికం, క్యారెట్, కాకర, క్యాలీఫ్లవర్‌ ధరలు కేజీ రూ. 50కి పైనే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల్లో భారీ క్షీణత, బోర్ల కింద సాగు చతికిలబడటంతో జూలై నెలలో సాధారణంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. గతేడాది ఇదే నెలలో గరిష్టంగా కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర ఈ ఏడాది రూ.50కి పైనే పలుకుతోంది. రాష్ట్ర పరిధిలో సాగు పూర్తిగా పడిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడటంతో ధరలు ఏ మాత్రం దిగిరానంటున్నాయి. నిజానికి రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు మించి ఉండదు. నిజామాబాద్, వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో టమాటా సాగు జరుగుతున్నా ఈ ఏడాది అది పూర్తిగా చతికిలబడింది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఈ జిల్లాలో సరాసరి మట్టాలు 10 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు తగ్గాయి. దీంతో బోర్ల కింద టమాటా సాగు పూర్తిగా తగ్గింది. సాగు చేసిన పంటల్లోనూ దిగుబడి తగ్గింది. రాష్ట్రం నుంచి వస్తున్న టమాటా కనీసం 10 శాతం అవసరాలను కూడా తీర్చలేకపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడాల్సి వస్తోంది.  

దిగుమతులు తగ్గడంతో: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్, చింతమణిల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై రాష్ట్రం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, ప్రస్తుతం అక్కడి నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. ముఖ్యంగా మదనపల్లిలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గింది. వస్తున్న కొద్దిపాటి టమాటా కూడా తమిళనాడుకు ఎక్కువగా సరఫరా అవుతుండటంతో రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. గతేడాది జూలై 23న 3 వేల క్వింటాళ్లు, 21న 3,095 క్వింటాళ్లు, 21న 3,490 క్వింటాళ్లు మేర బోయిన్‌పల్లి మార్కెట్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా రాగా ఈ ఏడాది 23న 2,664 క్వింటాళ్లు, 22న 2,239 క్వింటాళ్లు, 21న 1,800 క్వింటాళ్ల మేర సరఫరా అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1,200 క్వింటాళ్ల మేర ఒక్క బోయిన్‌పల్లి మా ర్కెట్‌కే సరఫరా తగ్గింది. దీంతో జూలైలో తగ్గాల్సిన ధర ఏమాత్రం తగ్గనంటోంది. ఈ పరిస్థితుల్లో మహా రాష్ట్ర, రాజస్తాన్‌ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరముంది. దీనికి తోడు ఇప్పు డిప్పుడే పుంజుకుంటున్న వర్షాలతో దిగుబడులు పెరిగితే ధర దిగి వచ్చే అవకాశముంది. లేని పక్షంలో సామాన్యుడికి ట‘మోత’తప్పేలాలేదు.

ఇతర కూరగాయలు కిలో రూ.50 పైనే.. 
టమాటాతో పాటు క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కాకర, బీన్స్, బీరకాయ ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. వీటన్నింటి ధరలు కిలో రూ. 50కి పైనే పలుకుతున్నా యి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌ నుంచి దిగుమతులు లేకపోవడంతో క్యాప్సికం ధర రూ.60కి పైనే ఉంది. క్యారెట్‌ సైతం రూ.70 వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.50 నుంచి రూ.60కి మధ్యలో ఉంది.

మరిన్ని వార్తలు