ఎల్బీనగర్‌ చౌరస్తాలో రేపటి నుంచి యూ-టర్న్‌

7 Oct, 2017 20:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా రేపటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యూ టర్న్‌ ఏర్పాటుతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించే క్రమంలో కూడళ్లలో యు టర్న్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే పలు కూడళ్లలో యూ-టర్న్ పద్ధతి సఫలమైన నేపథ్యంలో నిత్యం వేలాది వాహనాలతో బారులుతీరే ఎల్బీనగర్ కూడలిలోనూ ఈ పద్ధతిని ఆదివారం నుంచి అవలంభించబోతున్నట్లు తెలిపారు. మెట్రో రైలుతోపాటు, స్కైవే పనులు సైతం జరుగుతున్నందున ఈ చౌరస్తాలో వాహనదారులకు ఇబ్బంది కలుగని రీతిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా  రాచకొండ ట్రాఫిక్ డీసీపీ రమేష్, అదనపు డీసీపీ దివ్యచరణ్రావు, ఏసీపీ శ్రీధర్లు ఎల్బీనగర్ చౌరస్తాను పరిశీలించారు. ఇక్కడ యు టర్న్ ఎంత మేరకు సఫలమవుతుందోనని అంచనా వేశారు. ఈ మేరకు  ఆదివారం నుంచి ఎల్బీనగర్ కూడలిని మూసివేసి ఇటు ఎల్పీటీ మార్కెట్, అటు డీమార్ట్ ముందు యు టర్న్‌ తెరుస్తారు. అయితే, హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిలో యథావిధిగా రాకపోకలు ఉంటాయి. విజయవాడ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తా దాటాక డీ మార్ట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డువైపు వెళ్లే వాహనాలు చౌరస్తా దాటాక ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యు టర్న్ తీసుకోవాలి. ఉప్పల్ నుంచి సాగర్ రోడ్డు, దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ చౌరస్తాలో ఎడమవైపు మలుపు తీసుకుని ఎల్పీటీ మార్కెట్ వద్ద కుడివైపు యూ టర్న్ తీసుకోవాలి. సాగర్ రోడ్డు నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలు చౌరస్తాలో ఎడమవైపు మలుపు తిరిగి డీ మార్ట్ వద్ద యు టర్న్ తీసుకోవాలి. ప్రధానంగా ఆర్టీసీ బస్సులను కూడలి, యు టర్న్‌కు సమీపంలో ఆపరాదని.. విజయవాడ వెళ్లే బస్సులను ఆరెంజ్ ఆస్పత్రి ముందు నిలపాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీధర్ సూచించారు.

మరిన్ని వార్తలు