త్రిష నృత్యం.. రమణీయం

18 Jul, 2018 10:53 IST|Sakshi
త్రిష కూచిపూడి నృత్య ప్రదర్శన

నాంపల్లి: త్రిష కూచిపూడి నృత్యం శాస్త్రోక్తంగా సాగింది. రాగం, భావం, తాళానుగుణంగా ఆమె నర్తించారు. ప్రతి అంశాన్ని లయాత్మకంగా ప్రదర్శించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్నారు. ఎస్‌జీఎస్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి రవీంద్రభారతి వేదికపై చిలుక త్రిష నృత్య ప్రదర్శన కన్నులపండువగా జరిగింది. ఆమె తల్లిదండ్రులు దయానంద్, సుధారాణిలకు భారతీయ కళలపై ఉన్న ఆసక్తి, మక్కువతో కుమార్తెకు ఐదో ఏటనే కూచిపూడిలో చేర్పించారు. ప్రముఖ నాట్య గురువు వాణీరమణ వద్ద శిష్యరికంతో కూచిపూడిలో ప్రవేశం పొందిన త్రిష నృత్యకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అనేక కళా వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలను అందుకున్నారు. వేదికపై ప్రదర్శించిన జిమ్‌జిమ్‌ తనన, వీడలేరా వయ్యారం, భామాకలాపం, నీలమేఘ (తరంగం), సూర్యాష్టకం, సింహానందిని అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం డైరెక్టర్‌ భాగవతుల సేతూరాం అధ్యక్షతన జరిగిన సభలో నర్తకి త్రిషను అభినందించారు. ఈ సందర్భంగా గురు సత్కారం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు