ధాన్యం కొనుగోళ్లు.. లక్ష్యం చేరేనా?

9 Jan, 2020 01:04 IST|Sakshi

66 లక్షల టన్నుల సేకరణలో పూర్తయింది 40 లక్షలే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబం ధించి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుతాయా.. అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సారి ధాన్యం దిగుబడులు భారీగా ఉంటాయని సేకరణకు 3,700 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత 3 నెలల కాలంలో 3,658 కేంద్రాల ద్వారా 40 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరణ పూర్తయింది. 15, 20 రోజుల్లో ఖరీఫ్‌ ముగియనుంది. మరో 16 లక్షల టన్నుల సేకరణ చేయాల్సి ఉంది. నిజామాబాద్‌ జిల్లా నుంచి  7.20 లక్షల టన్నుల మేర ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. 5 లక్షల టన్నుల మేర సేకరణ జరిగింది. గరిష్టంగా మరో 50 వేల టన్నులు సేకరించినా, మిగతా లక్ష్యాలు చేరుకోవడం కష్టమే.

అంచనాలు తప్పాయా..?
వ్యవసాయ శాఖ లెక్కలు అంచనాలు తప్పాయా? లేక మిల్లర్లతో కుమ్మౖక్కై అధికారులు ఏమైనా తప్పుడు అంచనాలు రూపొందిం చారా? అనే అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. గతంలో జిల్లాకు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మార్గంలో ధాన్యం తీసుకొచ్చి, ఇక్కడి కేంద్రాల్లో అమ్మేవారు. ఈ ఏడాది పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా పోలీసు శాఖ సాయంతో కట్టడి చేశారు. ఈ చర్యల కారణంగా కొనుగోళ్లు ఏమైనా తగ్గాయా? అనే దానిపై విజిలెన్స్‌ ఆరా తీస్తోంది. ఇక జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ అంచనాలకు తగ్గట్లుగా ధాన్యం సేకరణ జరగడం లేదు. అయితే ఖరీఫ్‌ ఆలస్యమైనందున ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదని, ఈ 15 రోజుల్లో ఉధృతంగా కొనుగోళ్లు ఉంటాయని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఎంత నిజముందో ఈ నెలాఖరుకు తేలిపోనుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు