విద్యార్థుల కెరీర్‌కు బాటలు

6 Dec, 2019 01:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. తొలుత రాష్ట్రంలోని 194 మోడల్‌ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌ ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం ప్రారంభించింది. మై చాయిస్, మై ఫ్యూచర్‌ పేరుతో విద్యార్థుల ప్రతిభ, ఆసక్తులు, వారి భవిష్యత్తు అంచనాలపై నిర్వహించిన సైకోమెట్రిక్‌ టెస్టు ఫలితాల ఆధారంగా విద్యార్థులను సరైన దిశలో నడిపించే కార్యక్రమాన్ని గురువారం నుంచి అమల్లోకి తెచ్చినట్లు మోడల్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ సత్యనారా యణరెడ్డి వెల్లడించారు.

ఐఐటీ మద్రాసు ప్రొఫెసర్లు రూపొందించిన ఈ ప్రత్యేక కార్యాచరణను పైలట్‌ ప్రాజెక్టుగా 194 మోడల్‌ స్కూళ్లలోని 18 వేల మంది విద్యార్థులకు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ, ఆయా పాఠశాలల్లోని మిగతా విద్యార్థులకు త్వరలోనే నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వారి భవిష్యత్‌పై మార్గదర్శనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

విద్యార్థులకు మార్గదర్శిగా..
ఇక ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. వ్యవసాయ పనులు, రోజువారీ కూలి చేసుకొని బతికే కుటుంబాలకు చెందిన ఆయా విద్యార్థులు ఏ రంగంపై దృష్టి సారించాలో, దానికోసం ఎలాంటి కృషి చేయాలో, అందులో ఎలాంటి భవిష్యత్‌ ఉంటుందో తెలియదు. వారిని సరైన దిశలో వెళ్లేలా ప్రోత్సహించే వారు తక్కువ. అలాంటి వారెలా ముందుకెళ్లాలి.. తమకున్న ప్రతిభాపాటవాలేంటి? ఏ రంగంలో కృషి చేస్తే తొందరగా సక్సెస్‌ అవుతామన్న అంశాలపై అవగాహన కల్పించి, వారిని ఆ వైపు పోత్సహించేందుకు ‘మై చాయిస్‌.. మై ఫ్యూచర్‌’ కార్యక్రమాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా అమల్లోకి తెచ్చింది. క్రమంగా దీనిని విద్యాశాఖ పరిధిలోని 26 వేల పాఠశాలల్లోని 29 లక్షల మంది విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే కార్యాచరణను సిద్ధం చేస్తోంది.

ఇందులో ఏం చేశారంటే..
వ్యక్తిత్వం, కెరీర్‌ సంబంధమైన 12 కేటగిరీల్లో 72 ప్రశ్నలతో విద్యార్థులందరికీ సైకోమెట్రిక్‌ టెస్టు (మై చాయిస్‌.. మై ఫ్యూచర్‌) నిర్వహిస్తారు. అందులో ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థి ఆసక్తుల్ని తెలుసుకుంటారు. మోడల్‌ స్కూళ్లలో నిర్వహించిన ఈ టెస్టులో.. 27 శాతం మంది బాలురు పోలీసు కావాలని, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ రంగంలో స్థిరపడాలని 15 శాతం మంది ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. ఇక బాలికల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ రంగాల్లో స్థిరపడాలని 20 శాతం మంది, మెడిసిన్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ వైపు వెళ్లాలని 17 శాతం మంది లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైంది.

ఇప్పుడేం చేస్తారంటే...
ప్రతి విద్యార్థిపై చేసిన సైకోమెట్రిక్‌ టెస్టు ఆధారంగా ఆ విద్యార్థి ఎంచుకున్న కెరీర్‌కు సరిపడా సామర్థ్యాలుంటే అందుకోసం పాఠశాల స్థాయి నుంచే చేయాల్సిన కృషిని వివరించడం, ఆ రంగంలో పరిస్థితులను తెలపడం, వాటిని ఎదుర్కొని ముందుకుసాగేలా ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడతారు. కెరీర్‌ గైడెన్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్‌ వారికి ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుంటారు. అయితే ఆసక్తి ఉన్న రంగానికి సరిపడా సామర్థ్యాలు లేకపోతే వాటిని సాధించేలా విద్యార్థికి కౌన్సెలింగ్‌తోపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

దీనిపై విద్యార్థి తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, అందుకు అనుగుణమైన పరిస్థితులను ఏర్పరచేలా కృషి చేస్తారు. ఇక విద్యార్థికి ప్రభుత్వోద్యోగంపై ఆసక్తి ఉన్నా అతనికి స్కిల్స్‌ మాత్రం ప్రైవేటు మార్కెటింగ్‌లో రాణించేలా ఉంటే.. వాటిని ఆ విద్యార్థికి వివరించి, ఆ స్కిల్స్, ప్రతిభ ఆధారంగా ఆ రంగంలోకి వెళ్లేలా ప్రోత్సహిస్తామని మోడల్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు