పదోన్నతులపై అదే పీటముడి

6 Dec, 2017 03:08 IST|Sakshi

రాష్ట్ర నీటి పారుదల శాఖలో ఇంజనీర్ల ఆందోళన  

ఉమ్మడి రాష్ట్రంనుంచే నలుగుతున్న సమస్య  

ఏపీలో పదోన్నతులు ఇచ్చిన అక్కడి ప్రభుత్వం..తెలంగాణలోనే ప్రతిష్టంభన

స్పెషల్‌ సీఎస్‌ను కలవాలని జోన్‌–6 ఇంజనీర్ల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: నీటి పారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయగా, తెలంగాణలో దాని ఊసే కనబడకపోవడం ఇక్కడి ఇంజనీర్లను కలవరపెడుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియార్టీ జాబితాను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ఏపీ మాత్రం కేవలం తన పరిధిలోని నాలుగు జోన్‌ల ఇంజనీర్ల జాబితానే ఇవ్వడం..తెలంగాణ పరిధిలోని ఐదు, ఆరు జోన్‌ ఇంజనీర్ల జాబితాను సమర్పించకపోవడంతో పదోన్నతులపై పీటముడి నెలకొంది.

నీటి పారుదల శాఖలో పదోన్నతుల సమస్య ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉంది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్‌లో చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో ఉంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు జోన్‌–6లో ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారు. ఈ అంతరం పెరుగుతూ వస్తుండటంతో ప్రస్తుతం ఈ శాఖలో ముగ్గురు ఈఎన్‌సీలు, 23 మంది చీఫ్‌ ఇంజనీర్‌లు అంతా జోన్‌–5కి చెందిన వారే ఉన్నారు. దీనికి తోడు 45 సూపరింటెండెంట్‌ పోస్టుల్లో 28 మంది ఐదో జోన్‌ ఇంజనీర్లే ఉన్నారు. ఈ అన్యాయాన్ని కొత్త రాష్ట్రం తెలంగాణలో అయినా సవరించాలని జోన్‌–6 ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో వారికి న్యాయం చేసేలా నీటి పారుదల శాఖ ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దీని ప్రకా రం న్యాయం జరుగుతుందనుకున్న సమయం లో 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ పదోన్నతులకు సీనియార్టీ జాబితా సిద్ధమైంది. దీనిపై జోన్‌–6 ఇంజనీర్లు కొందరు హైకోర్టుకు వెళ్లగా, కొత్తగా తయారు చేసిన జాబితాపై హైకోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియార్టీ జాబితాను ఏపీ సమర్పించాలని, దానికి అనుగుణంగా తెలంగాణ నీటి పారుదల శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది.  

వివరాలివ్వని ఏపీ  
అయితే ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టుకు సీనియార్టీ జాబితాను సమర్పించిన ఏపీ సర్కారు కేవలం తన పరిధిలోని నాలుగు జోన్‌ల వివరాలనే అందజేసింది. ఐదు, ఆరు జోన్‌ల జాబితాను ఇవ్వలేదు. ఇదే సమయంలో సుప్రీంకు సమర్పించిన జాబితా ప్రకారమే ఏపీ తన పరిధిలోని ఇంజనీర్లకు పదోన్నతులు సైతం కల్పించింది. అయితే తెలంగాణలో మాత్రం పదోన్నతుల అంశం ఇంకా నలుగుతూనే ఉంది. ఇలాంటి సమస్యే పోలీస్‌ శాఖలో కూడా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా జోక్యం చేసుకొని జోన్‌–6 ఉద్యోగులకు న్యాయం చేశారని, అదే తరహాలో తమకూ న్యాయం చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు మొర పెట్టుకుంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు.

మరిన్ని వార్తలు