ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. మరి ప్రయివేట్‌ చేస్తారా?

9 Oct, 2019 12:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అప్పుల్లో ఉన్న ఆర్టీసీనీ ప్రయివేటీకరణ చేస్తానని చెబుతున్న సీఎం కేసీఆర్‌.. మరి అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించగలరా అంటూ జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రశ్నించారు. దాదాపు 50 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో జస్టిస్‌ చంద్రకుమార్‌, టీఎంయూ ఆర్టీసీ యూనియన్‌ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డి, ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కార్మికులు, తదితరులు పాల్గొని ప్రసంగించారు. 

ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం
ఈ సందర్భంగా అశ్వద్దామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని స్పష్టం చేశారు. ‘ఆర్టీసీ సమ్మెపై సీఎం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. అయితే ఆర్టీసీని బతికించడమే మా లక్ష్యం. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదు. కార్మికులు దాచుకున్న పీఎఫ్‌ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదు?. ఆర్టీసీపై డిజీల్‌ భారం ఎక్కువైంది. 27 శాతం డిజీల్‌పై పన్ను వేస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థపై నాలుగో వంతు ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రజలు మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాకు సహకరించాలి. అవసరమైతే తెలంగాణ బందుకు పిలుపునిద్దాం’అని అశ్వద్ధామరెడ్డి పేర్కొన్నారు. 

కాగా, తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె ఐదో రోజుకు చేరింది. ప్రజల ప్రయాణ కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దసరా పండగ ముగించుకోని తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాలనుకునేవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కాగా సమ్మెపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పోరాడటానికి ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ సమావేశంతో అనంతరం గవర్నర్‌ను కలవాలని అఖిలపక్ష సభ్యులు భావిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు