డ్రంకన్‌ డ్రైవ్‌.. రోజుకు రూ.2లక్షల ఫైన్‌

2 Aug, 2019 10:48 IST|Sakshi

రెండు నెలల్లో పట్టుబడ్డ 2,815 మంది

రూ.61,35,400 జరిమానా చెల్లింపు

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ గత నెలలో ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కిన మందుబాబులు సరాసరిన రోజుకు చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షల పైనే. జూలైలో స్పెషల్‌ డ్రైవ్స్‌లో పట్టుబడిన 2,815 మంది మందుబాబులు కోర్టులో రూ.61,35,400 చెల్లించారని ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ గురువారం వెల్లడించారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ చిక్కిన వారిపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నామని, గత నెల్లో 480 మందికి శిక్ష కూడా పడిందని ఆయన పేర్కొన్నారు. దీనికితోడు వీరిలో 223 మంది జైలుకు వెళ్ళగా... 62 మంది డ్రైవింగ్‌ లైసెన్సుల్ని (డీఎల్స్‌) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడమో, సస్పెండ్‌ చేయడమో జరిగిందని ఆయన వెల్లడించారు.

డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు ఇద్దరు డ్రైవింగ్‌ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేయగా... ఇద్దరివి ఆరేళ్ళు, ఒకరిది ఐదేళ్ళు, 11 మందివి మూడేళ్ళు, నలుగురివి రెండేళ్లు, ముగ్గురివి ఏడాది, ఆరుగురివి ఆరు నెలల పాటు మరో ముగ్గురిని నెల పాటు సస్పెండ్‌ చేసినట్లు అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. జైలుకు వెళ్ళిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి పది రోజులు, ఏడుగురికి వారం, 12 మందికి నాలుగు రోజులు, 19 మందికి మూడు రోజులు, 142 మందికి రెండు రోజులు, 42 మందికి ఒకరోజు జైలు శిక్ష పడింది. వీరితో పాటు మరో 257 మందిని కోర్టు సమయం ముగిసే వరకు న్యాయస్థానంలో నిల్చుని ఉండేలా శిక్ష వేశారు. డ్రంక్‌ డ్రైవింగ్‌తో పాటు మరో ఉల్లంఘననీ ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ కోర్టులో చార్జ్‌షీట్‌ వేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానాలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం నేరంపై పది మందికి రెండు రోజుల జైలు శిక్షలు విధించాయి. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్స్‌ ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు