ఇద్దరు ‘ఆదర్శ’ ఉపాధ్యాయుల సరెండర్‌

15 Nov, 2019 07:59 IST|Sakshi

కలెక్టర్‌ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో

సాక్షి, గుడిహత్నూర్‌(ఆదిలాబాద్‌) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్‌ స్కూల్‌) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సైఫుల్లాఖాన్, అదే పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ గౌడ్‌లను సరెండర్‌ చేస్తూ డీఈవో రవీందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అశ్విని.. ప్రిన్సిపాల్‌ సైఫుల్లాఖాన్‌ తనపై దాడి చేశాడని గత మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించి అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌తో విచారణ జరిపించారు. విచారణ పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో సైఫుల్లాఖాన్‌ను ఆయన మాతృ పాఠశాల ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌కు సరెండర్‌ చేయగా సత్యనారాయణగౌడ్‌ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్‌ చేశారు.

వివాదాలకు బీజం పోసిన సత్యనారాయణ గౌడ్‌!
కరీంనగర్‌ జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో విధులు నిర్వహించి అవినీతి అక్రమాలకు పాల్పడి పనిష్‌మెంట్‌పై ఇక్కడికి బదిలీపై వచ్చిన సత్యనారాయణ గౌడ్‌ వచ్చిన అనతికాలంలోనే పాఠశాలలో అనేక వివాదాలకు కారణమైనట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పాఠశాలలో జరిగే చిన్నచిన్న పొరపాట్లను వేలెత్తి చూపి కాంట్రాక్టు సిబ్బందిని మచ్చిక చేసుకొని వర్గాలుగా చీల్చి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైఫుల్లాఖాన్‌ తప్పించి తానే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాలని వివాదాలు సృష్టించినట్లు తెలిసింది. అదనపు జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ చేపట్టిన సుధీర్ఘ విచారణలో తెరవెనుక ఉండి వివాదాలు సృష్టిస్తున్న సత్యనారాయణ గౌడ్‌ తెరముందుకు వచ్చాడు. దీంతో అతనని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్‌ చేయడంతో ఆదర్శ పాఠశాల కథ సుఖాంతం అయింది.

>
మరిన్ని వార్తలు