బయటికి రాలేం బాబోయ్‌!

22 May, 2017 06:56 IST|Sakshi
బయటికి రాలేం బాబోయ్‌!

రాష్ట్రవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు

45 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
వడదెబ్బకు 12 మంది మృతి
ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఏడుగురు..
మరో రెండు రోజులు తీవ్ర వడగాడ్పులు
హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక


సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌
రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం అల్లాడిపోతోంది. భానుడి ప్రతాపంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతోపాటు.. ఉదయం 9 గంటల నుంచే వడగాడ్పులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మండే ఎండల ధాటికి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్ల నుంచి వచ్చే వేడిగాలితో తట్టుకోలేక.. బయటికెళ్తే ఎండలను భరించలేక సతమతమవుతున్నారు. పగటి ఎండల తీవ్రత రాత్రిళ్లు కూడా తగ్గడం లేదు. దీంతో రాత్రి పూట వేడి వాతావరణం నెలకొంటోంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజు వడదెబ్బకు 12 మంది మృతిచెందారు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే ఏడుగురు మృతి చెందగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

మరో 2 రోజులు తీవ్ర వడగాడ్పులు
రాష్ట్రంలో మరో 2 రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు ఉంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తర్వాతి రెండు రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు ఆదివారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇతర ప్రాంతాల్లోనూ 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌ల్లో)
ప్రాంతం            ఉష్ణోగ్రత
హన్మకొండ        45.0
రామగుండం      44.6
నల్లగొండ           44.4
ఆదిలాబాద్‌        44.3
నిజామాబాద్‌      43.9
మహబూబ్‌నగర్‌    43.6
మెదక్‌                43.6
ఖమ్మం              43.0
హైదరాబాద్‌         42.0
హకీంపేట           40.3

మరిన్ని వార్తలు