సిద్ధారం అడవుల్లో ఎదురుకాల్పులు

22 Sep, 2017 01:05 IST|Sakshi

తప్పించుకున్న న్యూడెమోక్రసీ రామన్నదళం

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని సిద్ధారం అడవుల్లో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రామన్న దళానికి, పోలీసులకు మధ్య గురువారం వేకువజామున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధ్రువీకరించారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన చెప్పారు. సిద్ధారం అడవిలో గొత్తికోయలు నివసించి వదిలేసిన ఓ గుడిసెలో న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) రామన్న దళం(సుమారు 16 మంది సభ్యులు) ఉంటూ పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.

దీంతో మూడు బృందాలు బుధవారం రాత్రి కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం వేకువజామున ఓ గుడిసె వద్ద దళం తారసపడగా, ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. చాకచక్యంగా దళ సభ్యులు తప్పించుకుని వెళ్లిపోయారు. దళ సభ్యులు వదిలి వెళ్లిన తుపాకులు, కిట్‌ బ్యాగులు, బియ్యం, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, కాల్పుల్లో ముగ్గురు న్యూ డెమోక్రసీకి చెందిన మహిళా దళ సభ్యులు మృతి చెందారని, వారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారని, తర్వాత మరో ఇద్దరు మృతి చెందారని పుకార్లు షికార్లు చేశాయి. పోలీసుల అదుపులో అనారోగ్యంతో ఉన్న దళ సభ్యుడిపాటు ఇద్దరు గ్రామస్తులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

మరిన్ని వార్తలు