పోలీసు భవనాలకు 2 వేల కోట్లు

22 Oct, 2016 02:11 IST|Sakshi
పోలీసు భవనాలకు 2 వేల కోట్లు

బడ్జెట్‌లో కేటాయింపునకు సీఎం అంగీకారం: నాయిని
పోలీసు అమరవీరులకు నివాళులు 

సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించనున్న పోలీసు శాఖ భవనాల కోసం వచ్చే బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి వెల్లడించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శుక్రవారం గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించా రు.

‘ప్రస్తుతం దేశంలో ప్రతి 53 వేల మంది జనాభాకు ఒక పోలీసు స్టేషన్ ఉంది. జిల్లాల విభజన తర్వాత రాష్ట్రంలో 49 వేల మందికి ఒక పోలీసుస్టేషన్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతల పరిరక్షణ కీలకం. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పోలీసు విభాగంలో అమరుల త్యాగం వెలకట్టలేనిది’ అని నాయిని చెప్పారు.

సాంకేతిక వినియోగంలో రాష్ట్రం ప్రథమం
డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ... ‘ఏటా అనేకమంది అమర వీరులవుతున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 473గా ఉంది. బహదూర్‌పుర కానిస్టేబుల్ బి.శ్రీనివాస్ విధి నిర్వహణలో అమరుడయ్యారు. అన్ని విభాగాలు, బలగాల్లో శౌర్య గాథలు ఉంటున్నాయి. అవి వింటే ఆశ్చర్యంతో పాటు గర్వంగా ఉంటుంది. సంక్షేమం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అధికారులు, సిబ్బంది కుటుంబాలకు రూ.40 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం ఇస్తున్నాం’ అన్నారు.

కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తమ సందేశాలను పంపించారు. అమరవీరుల వివరాలతో కూడిన ‘షహాద్, అమరులు వారు’ పుస్తకాలను నాయిని ఆవిష్కరించారు. కాగా, వివిధ విభాగాల్లో ‘సాక్షి’ విలేకర్లు ఎస్.కామేశ్వరరావు, ఆర్.దేవిదాస్, జె.వాసుదేవరెడ్డిలకు పురస్కారాలు దక్కాయి. నగర సీపీ మహేందర్‌రెడ్డి, నిఘా చీఫ్ నవీన్‌చంద్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ బి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు