యురేనియం ఉత్పత్తి నాలుగు రెట్లు పెంపు..! 

2 Jun, 2019 03:03 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం

‘చిట్రియాల్‌’ డీపీఆర్‌ సిద్ధం 

దేశవ్యాప్తంగా 13 కొత్త యురేనియం గనులు 

రూ.10,500 కోట్ల పెట్టుబడితో తవ్వకాలు 

యూసీఐఎల్‌ సీఎండీ  సి.కె.అస్నాని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : పెరుగుతున్న అణు ఇంధన అవసరాలను తీర్చేందుకు యురేనియం ఉత్పత్తిని నాలుగురెట్లు ఎక్కువ చేయనున్నట్లు యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసీఐఎల్‌) చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.కె.అస్నానీ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 13 కొత్త గనులను ప్రారంభిస్తామని.. ఇప్పటికే అందుబాటులో ఉన్న గనులను మరింత విస్తరిస్తామని ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అణు ఇంధన సముదాయం 49వ వ్యవస్థాపక దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొత్త గనుల వివరాలను వెల్లడించారు. నాగార్జున సాగర్‌ సమీపంలో ఇప్పటికే గుర్తించిన యురేనియం నిక్షేపాలను వెలికితీసేందుకుగాను చిట్రియాల్‌ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన గనికి చెందిన డీపీఆర్‌ సిద్ధమైందని తెలిపారు.

అన్ని రకాల అనుమతులు తీసుకున్న తరువాత ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతోపాటు రాజస్తాన్‌లోని రోహిల్, కర్ణాటకలోని గోగి, ఛత్తీస్‌గఢ్‌లోని జజ్జన్‌పూర్‌లలో కొత్త యురేనియం గనులు ఏర్పాటవుతాయని అన్నారు. కొత్తగా చేపట్టనున్న 13 యూరేనియం ప్రాజెక్టుల ద్వారా రానున్న ఏడు – ఎనిమిదేళ్లలో దేశ యురేనియం ఉత్పత్తి ఇప్పుడున్నదానికి నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని వివరించారు. కర్ణాటకలోని గోగి కేంద్రంలో లభించే ముడిఖనిజం మిగిలిన వాటికంటే ఎంతో నాణ్యమైందని.. అక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ యురేనియం రాబట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. కడప జిల్లా తుమ్మలపల్లెలోని యురేనియం గనిలో వెలికితీతకు చెందిన సమస్యలన్నింటినీ అధిగమించామని, ప్రస్తుతం అక్కడి నుంచి ఉత్పత్తి సాఫీగా జరుగుతోందని తెలిపారు. 

ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం... 
దేశ అణు ఇంధన అవసరాలను తీర్చడంలో అణు ఇంధన సముదాయం అనేక సవాళ్లను అధిగమించి.. అత్యున్నత స్థాయిలో పనిచేస్తోందని సంస్థ సీఎండీ డాక్టర్‌ దినేశ్‌ శ్రీవాస్తవ తెలిపారు. దేశ అంతరిక్ష, వ్యూహాత్మక అవసరాలకు కూడా తగు విధంగా ఉపకరిస్తున్నట్లు శనివారం జరిగిన 49వ వ్యవస్థాపక దినోత్సవాల్లో ఆయన చెప్పారు. కేవలం యురేనియం ఇంధన బండిళ్లను తయారు చేయడమే కాకుండా.. అందుకు అవసరమైన అన్ని విడిభాగాలను కూడా పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్న సంస్థ ఈ దేశంలో ఎన్‌ఎఫ్‌సీ ఒక్కటేనని అన్నారు.  కార్యక్రమంలో ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ బాధురి,  ఎన్‌ఎఫ్‌సీ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సి.ఫణిబాబు, భారత అణుశక్తి సంస్థ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ మెర్విన్‌ అలెగ్జాండర్‌  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు