ప్రోటోకాల్‌ పాటించాలి : ఉత్తమ్‌

10 Sep, 2019 19:02 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్‌ పాటించడం లేదని, అధికారిక కార్యక్రమాల విషయంలో ప్రోటోకాల్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. సూర్యాపేట జిల్లా మేల్లచేరువు మండల కేంద్రంలో 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో కలసి ఉత్తమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, దయాకర్‌రావులు ఇద్దరు సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులని, రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి వీరు కృషి చేయాలని కోరారు. రైతు బంధు చెక్కులు రాలేదని, రైతుల రుణ మాఫీ ఊసే లేదని మంత్రులకు గుర్తు చేశారు. 

మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రోటోకాల్ తప్పని సరిగా పాటించాలని అధికారులకు సూచించారు. ‘ఆర్ధిక మాంద్యం వల్ల బడ్జెట్ తక్కువగా ప్రకటించారు. సంక్షేమ పథకాలకు, రైతులకోసం ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశాం. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తున్నాం. యూరియా లేదని రైతులు అధైర్య పడవద్దని’ భరోసా ఇచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్‌ను ప్రతి ఒక్కరు అభినందించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు