‘రైతు’ బేజారు!

1 Nov, 2018 10:28 IST|Sakshi

మార్కెట్లలో దళారుల తిష్ట  

రైతుబజార్లలో వారిదే ఇష్టారాజ్యం

రేట్లు పెంచి దందా సాగిస్తున్న వైనం  

అధికార పార్టీ నేతలు, మార్కెటింగ్‌ అధికారుల అండ

నష్టపోతున్న రైతులు, వినియోగదారులు

సాక్షి సిటీబ్యూరో: పండించిన కూరగాయలు, ఆకుకూరల వంటి పంటను రైతులే స్వయంగా అమ్ముకునే సౌకార్యం కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతుబజార్లు దళారులకు, బ్రోకర్లకు అడ్డాగా మారాయి. రైతుల పేర్లతో వారే మార్కెట్లలో స్థలాలను ఆక్రమించుకున్నారు. దీంతో వాస్తవ రైతులు తాము తెచ్చిన కూరగాలను అమ్ముకునేయందు స్థలం లేక రైతుబజార్‌ గేడు ముందు దీనస్థితిలో ఉంటున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఇటీవల నగరంలో పలు రైతు బజార్లను విజిట్‌ చేయగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. రైతులు దళారీల దోపిడీకి గురికాకుండా చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే వారు దారుణంగా దోపిడీకి గురవుతున్నట్టు తేలింది. ఇటు రైతులకు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించాలనే ఉద్దేశంతో ఈ రైతుబజార్లను ఏర్పాటు చేశారు. కానీ రైతుల స్థానాన్ని దళారులు ఆక్రమించడంతో ఇక్కడి కూరగాయల ధరలు బయటి దుకాణాలతో పోటీపడుతున్నాయి. ఒక్కోసారి వారంతపు సంతలో కంటే ఈ రైతు బజార్లలోనే ధరలు అధికంగా ఉంటుండడం గమనార్హం. 

రైతుల ముసుగులో బినామీలు  
గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం 11 రైతుబజార్లు ఉన్నాయి. వీటిలో ఎర్రగడ్డ మోడల్‌ రైతుబజారే పెద్దది. ఈ మార్కెట్‌లో దాదాపు 550 మందికి పైగా రైతులుగా నమోదు చేసుకున్నారు. మెహదీపట్నం రైతుబజార్‌లో 350 మంది దాకా రైతులుగా నమోదు చేసుకున్నారు. ఫలక్‌నుమా, ఆల్వాల్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, వన్థలిపురం తదితర రైతు బజార్లలో 200 చొప్పున పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఈ అన్నిచోట్లా ఇప్పుడు రైతులను పక్కనపెట్టి వారి పేర్లతో బినామీలే రాజ్యమేలుతున్నట్టు అరోపణలు ఉన్నాయి. రైతు బజార్లలో కూరగాయలను అమ్ముకునేందుకు రైతులు తమ పేర్లను, ఇతర వివరాలను రెవెన్యూ కార్యాలయాల వద్ద నమోదు చేసుకుంటారు. ఇలా నమోదు చేసుకున్న వారికి ‘రైతు కార్డులు’ జారీ చేస్తారు. వారే రైతు బజార్లలో కూరగాయలు అమ్ముకునేందుకు అర్హులు. కానీ అన్ని రైతు బజార్లలోనూ కొందరు దళారులు బినామీ పేర్లతో రైతులుగా అవతారం ఎత్తారు. కొందరు ఏకంగా ఆయా బజార్ల ఎస్టేట్‌ అధికారులతో కుమ్మక్కై నేరుగా రైతు కార్డులను దక్కించుకుంటున్నారు.

హోల్‌సేల్‌ మార్కెట్‌లో కొనిరైతు బజార్లలో అమ్మకాలు
నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపుర్, ఎల్బీనగర్‌తో పాటు ఇతర హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లలో రైతుల ముసుగులో ఉన్న ఈ బినామీలు, దళారులు కూరగాయలు కొని రైతుబజార్లలో అమ్ముతున్నారు. అంతేకాదు హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి కొని తెచ్చిన సరుకును రైతుబజార్లలో వేలం వేసి మరీ అమ్ముతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి ఉదయం తెచ్చిన కూరగాయలనే రైతు బజార్లలోని చిన్న వ్యాపారులకు విక్రయించి పట్టీలు (ధరలు నిర్ధారణ) ఇవ్వడం.. సాయంత్రం డబ్బులు వసూలు చేయడం నిత్యం జరిగే ప్రక్రియ. మరోవైపు కొందరు దళారులు రైతుల నుంచి అతి తక్కువ ధరలకు సరుకును కొనుగోలు చేసి వాటినే రైతుబజార్లలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ దందా అంతా మార్కెటింగ్‌ అధికారులు, రైతుబజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్ల అండదండలతోనే సాగడం గమనార్హం. ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రైతులే చెబుతున్నారు.  

తెలిసినా పట్టించుకోని అధికారులు
ప్రతి రోజు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ (ముందు వచ్చిన వారికే అవకాశం) అన్న పద్ధతిలో రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు స్థలాలు కేటాయించాలి. ఏ రోజుకా రోజు ఏ రైతుకు ఎక్కడ స్థలం దొరుకుతందో తెలియదు. ప్రస్తుతం రైతు బజార్లలో కొందరు దళారీలు తిష్టవేశారు. వారు వ్యాపారం చేసుకునే చోటు వరేవారికి అవకాశం ఇవ్వకుండా చేశారు. రైతుబజారు ఏర్పాటు నుంచి ఎక్కడ వ్యాపారం మొదలు పెట్టారో అక్కడే వారున్నారు. అసలు రైతులకు కూరగాయలు అమ్ముకోవడానికి స్థాలాలు దొరక్క రైతుబజార్ల బయట ఉండాల్సి వస్తోంది. ముందుగా మార్కెట్‌కు వచ్చే రైతులను పక్కబెట్టి ఎస్టేట్‌ ఆఫీసర్లు దళారులకే  ప్రధాన్యం ఇస్తున్నట్లు వికారాబాద్‌కు చెందిననో రైతు ‘సాక్షి’ వద్ద వాపోయాడు.  

రైతులకు ప్రాధాన్యం కల్పించండి..
ఏ లక్ష్యంతో రైతుబజార్లు ఏర్పాటు చేశారో అ లక్ష్యం నెరవేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పండించిన కూరగాయలను నేరుగా వియోగదారలుకు విక్రయిస్తే నాలుగు డబ్బులు మిగులుతాయని భావించి ఇక్కడకు సరుకును తెస్తే దళారులు తమ వద్ద నుంచి తక్కువ ధరకే కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని, మార్కెట్‌ అధికారుల పక్షపాతంతో తమకు అన్యాయం చేస్తున్నారని రంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌ జిల్లాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు