ప్రతి ఇంటా.. గ్రామ దేవత పేరే

7 Mar, 2019 08:28 IST|Sakshi
వన్నెల్‌(బి)లోని దేవమ్మ ఆలయం, ఆలయంలోని దేవమ్మతల్లి విగ్రహం 

దేవేంద్రుల పల్లె.. వన్నెల్‌(బి)

బాల్కొండ: ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ.. ఆ దైవం పేరు లేకుండా గ్రామంలోని ఏ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఉండవు.. అదే బాల్కొండ మండలం వన్నెల్‌(బి) గ్రామం. ఆ గ్రామ జనాభా సుమారు 5,172 మంది ఉంటారు. 600పై చిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వన్నెల్‌(బి) ఎంతో అభివృద్ధి బాటలో ఉంది. రాజకీయంగా కూడా ఎంతో చైతన్యం గల గ్రామం. ఆ గ్రామం దేవెంద్రుల పల్లెగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ పేరుతో ప్రతి కుటుంబంలో ఒకరి పేరు కచ్చితంగా ఉంటుంది. మగవారికి దేవేందర్, దేవన్న, ఆడవారికి దేవమ్మ, దేవాయి పేర్లు ఉంటాయి. ఈ తరం పిల్లలకు కూడా ముందుగా ఆ పేరుతో నామకరణం చేసిన తరువాతనే ఇతర పేర్లు పెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆ గ్రామంలో అందరూ దేవేందర్‌లు ఉండడం వలన ఇంటి పేరు తప్పని సరిగా వాడాల్సి వస్తుంది. దీంతో అధికంగా పూర్తి పేరుకు బదులు ఇంటి పేర్లతో ఎక్కువ మందిని పిలుచుకుంటారు. లేదంటే అందరు దేవేందర్‌లు ఉండడంతో ఏ దేవేందర్‌ ఏంటో తెలియదంటారు. దేవమ్మ ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కావడంతో గ్రామ శివారులో ఆలయం నిర్మించారు. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమిలో చెట్లను పెంచారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం జూన్‌ మాసంలో పెద్ద ఎత్తుగా దేవమ్మ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి శుక్రవారం దేవమ్మకు పూజలు నిర్వహిస్తారు. దేవమ్మ కరుణతో అందరం చల్లగా ఉన్నామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రతి ఇంట్లో పేరు ఉంటుంది 
వన్నెల్‌(బి) గ్రామంలో ప్రతి ఇంట్లో దేవమ్మ పేరుతో గల దేవేందర్, దేవన్న, లాంటి పేర్లు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి పిల్లలకు కూడా మొదట ఆ పేరుతో పేరు పెట్టాకే వేరే పేర్లతో పిలుచుకుంటాం. దేవమ్మ కరుణతో గ్రామస్తులందరం చల్లగా ఉంటున్నాం.
ఏనుగు దేవేందర్, గ్రామస్తుడు

మా ఆరాధ్య దైవం.. 
దేవమ్మ మా గ్రామస్తుల ఆరాధ్య దైవం కావడంతో అందరి ఇళ్లలో అమ్మ వారి పేరుతో పేర్లు పెంటుకుంటాం.  ప్రతి సంవత్సరం ఘనంగా దేవమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. అందరివి ఒకే పేర్లు కావడంతో ఇంటి పేర్లు తప్ప కుండా వాడుతాం.
రెంజర్ల దేవేందర్, గ్రామస్తుడు

మరిన్ని వార్తలు