వీవీప్యాట్లు లెక్కించవచ్చు

14 Feb, 2019 02:23 IST|Sakshi

ఈవీఎంల పనితీరుపై సీఈవో రజత్‌కుమార్‌ స్పష్టీకరణ 

ఎన్నికల నిర్వహణపై డీఈవోలు, ఆర్వోలకు శిక్షణ  

పరీక్షల్లో విఫలమైతే మరోదఫా శిక్షణకు ఢిల్లీకి పంపుతాం  

వికారాబాద్‌ కలెక్టర్‌ అనుకోకుండా తప్పు చేశారు 

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలు 35 వేలకుపైగా పోలింగ్‌ కేంద్రాల్లో జరిగాయని, అందులో దాదాపు 200 పోలింగ్‌ కేంద్రాలకు ప్రిసైడింగ్‌ అధికారులు సరైన అవగాహన లేకుండా ఈవీఎంలను వినియోగించి పొర పాట్లు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు. మాక్‌ పోల్‌ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించే మీటను నొక్కకుండానే పోలింగ్‌ ప్రారంభించడంతో వాస్తవంగా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లసంఖ్య మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఈ సందర్భం గా నెలకొనే అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీ ప్యాట్‌ రసీదులను లెక్కించవచ్చన్నారు. లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగం గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లైన కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు రిటర్నింగ్‌ అధికారులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శిక్షణ అనంతరం ఆర్వోలకు పరీక్షలు నిర్వహించామని, పాసైతేనే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

ఈ పరీక్షల్లో విఫలమైన అధికారులను ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల అధ్యయనం, నామినేషన్లను భర్తీ చేసే విధానం, వికలాంగులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, ఓటు చేసే విధానం తదితర అన్ని అంశాలపై డీఈవోలకు, ఆర్వోలకు శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో డీఈవోలు, ఆర్వోల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న డీఈవోలు, ఆర్వోలను భర్తీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడున్న కొంతమంది ఆర్‌వోలను మార్చనున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని రజత్‌కుమార్‌ తెలిపారు. అన్ని టెక్ని కల్‌ విషయాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయపరమైన సమస్యలను కూడా చర్చించినట్లు తెలిపారు. సీ– విజిల్‌ యాప్, 1950 కాల్‌సెంటర్‌ కూడా ఉపయోగిస్తామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పా రు. శాంతిభద్రతల విషయంలో లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామన్నారు.  

కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ సమీక్ష 
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా ఆరా తీశారు. ఏపీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని ఇక్కడే రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డిలతో సమావేశమై లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలున్న చోట్లలో జిల్లా ఎన్నికల అధికారుల నియామకం, అవసరమైన చోట్లలో బదిలీలు, రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సీఎస్‌ ఎస్కే జోషితో సీఈవో రజత్‌కుమార్‌ సచివాలయంలో సమావేశమై చర్చించారు.  

 ఆ కలెక్టర్‌ అనుకోకుండా పొరపాటు చేశారు
‘శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కష్టపడ్డారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒమర్‌ జలీల్‌ సైతం బాగా కష్టపడి పనిచేశారు. అయితే, ఆయన పొరపాటుగా ఈవీఎం యంత్రాలను తెరిచి చిక్కుల్లోపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. పొరపాటుగా ఈవీఎంలను తెరిచి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయన్ను సస్పెండ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకోకతప్పలేదు’అని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.  

27.31 లక్షల దరఖాస్తులు... 
ఓటర్ల జాబితా సవరణ కింద దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 4తో ముగిసిందని, గడువులోగా 27.31 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్‌కుమార్‌ అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 7 లక్షల దరఖాస్తులు తొలిసారిగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారన్నారు. మిగిలిన పెండింగ్‌ దరఖాస్తులను సైతం పరిష్కరిస్తే తొలిసారిగా ఓటేయనున్న యువ ఓటర్ల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు