వైద్యాలయంలో నీ దర్శనభాగ్యం దుర్లభమేనా | Sakshi
Sakshi News home page

వైద్యాలయంలో నీ దర్శనభాగ్యం దుర్లభమేనా

Published Thu, Mar 7 2019 7:57 AM

KGH Doctors Negligence on OP day Visakhapatnam - Sakshi

ఏడుకొండలపైనున్న ఆ శ్రీనివాసుడి దర్శనమైనా లభిస్తుందిగానీ.. మన పక్కనే ఉన్న ఉత్తరాంధ్ర వైద్యాలయం కేజీహెచ్‌లోని ఈ శ్రీనివాసుడి దర్శనభాగ్యం మాత్రం భక్తరోగులకు దుర్లభమే..ఇది ఏ ఒక్కరోజో కాదు.. ఎప్పుడు ఆ విభాగానికి వెళ్లినా ఆయనగారి జాడ కనిపించదు.. అలాగనీ ఆయన ఆస్పత్రి రారా.. ఉద్యోగం చేయరా అంటే.. రికార్డుల్లో చేస్తున్నట్లే ఉంటుంది.ఠంచనుగా విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్‌ నమోదు చేసేసుకుంటారు. అంతే అక్కడి నుంచి ఆ ఛాయల్లోనే కనిపించరు.ఆయనే డాక్టర్‌ శ్రీనివాసరావు.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి.ఆయనగారు ఎప్పుడొస్తారో.. ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలీదు. చాంబర్‌లోని ఆయన సీటు ఎప్పుడు చూసినా ఖాళీగానే కనిపిస్తుంది.ఆ విభాగంలో పని చేసే సిబ్బంది బహుశా అప్పుడప్పుడు మాత్రమే ఆయన్ను చూస్తుంటారేమో.. ఇక రోగుల సంగతి సరేసరి..వారాలకు వారాలు అక్కడికి రావడం.. ఎదురు చూడటం తప్ప.. ఆయన దర్శనం మాత్రం దక్కదు. జూనియర్‌ డాక్టర్లు, ఇతర సిబ్బంది ఆ విభాగాన్ని నడిపిస్తున్నారన్న వాదన ఉంది. యథారాజా.. తథా ప్రజ అన్నట్లు దూరప్రాంతాల నుంచి వచ్చే రోగులకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నరకం చూపిస్తోంది.గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగులపై కనీస దయ లేకుండా సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కేజీహెచ్‌ విభాగాల పనితీరుపై వరుస కథనాలు ఇస్తున్న సాక్షి.. బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో క్షేత్ర పరిశీలన జరిపినప్పుడు రోగుల కష్టాలు.. ఆ విభాగం పెద్దల నిర్వాకం కళ్లకు కట్టాయి.

విశాఖ సిటీ: కేజీహెచ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం రోగులకు నరకం చూపిస్తోంది. గంటల తరబడి పడిగాపులు కాసే నిరుపేద రోగుల పట్ల కనికరం లేకుండాపోతోంది. సమయ పాలనకు తిలోదకాలిస్తూ.. వచ్చినప్పుడే వైద్యం అన్నట్లుగా వైద్యుల తీరు ఉంటోంది. హెచ్‌వోడీ బాటలోనే దిగువ స్థాయి సిబ్బందీ కూడా నడుస్తుండడంతో రోగుల పాట్లు చెప్పనలవి కావు. నాలుగు రోజులుగా కేజీహెచ్‌ విభాగాల పనితీరుపై వరుస కథనాలు సాక్షి అందిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో రోగుల పరిస్థితి, వైద్యుల వ్యవహార శైలిపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్టు.

హెచ్‌వోడీ ఎక్కడ?
‘వీళ్లెప్పుడూ ఇంతేనయ్యా.. 9 అంటారు.. 11 అంటారు.. 12.30 వరకూ కనిపించరు. మళ్లీ శనివారం రమ్మంటారు’ అంటూ పలువురు గ్యాస్ట్రో ఎంట్రాలజీ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ ఉన్న ప్రతి బుధవారం వైద్యులు ఏనాడు 11 గంటలకు రాలేదని, ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉదయం 12.30 గంటలు దాటినా రావడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఇదీ.. గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగం పరిస్థితికి అద్ధం పడుతోంది. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇక్కడ వైద్యుల తీరు ప్రాణసంకటంగా మారుతోంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌(హెచ్‌వోడీ) డాక్టర్‌ శ్రీనివాసరావు సంగతైతే సరేసరి.. ఎప్పుడు ఆస్పత్రికి వస్తున్నారో.. ఎప్పుడు వెళ్తున్నారో..? అసలు వస్తున్నారో లేదో కూడా తెలీని పరిస్థితి. సాధారణంగా.. వైద్యులు ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వచ్చే సమయంలోను, సాయంత్రం 4 గంటలకు తిరిగి వెళ్లే సమయంలోను బయోమెట్రిక్‌ వేయాలి. అయితే డాక్టర్‌ శ్రీనివాసరావు ఇటు ఓపీలో కాని అటు వార్డులో కాని ఎక్కడా కనిపించరు. విచారిస్తే డాక్టర్‌ ఇప్పటి వరకూ ఇక్కడే ఉన్నారని, సూపరింటెండెంట్‌ కార్యాలయానికి వెళ్లారని వార్డులోని సిబ్బంది సర్ది చెబుతుంటారు. అక్కడికి వెళ్లి చూస్తే కనిపించరు. తిరిగి ఓపీ దగ్గరికి వచ్చి ఏ సమయానికి తిరిగి వస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా సదరు సిబ్బంది నీళ్లు నములుతుంటారు.

కేజీహెచ్‌ వద్దు.. కార్పొరేట్‌ ముద్దు
ఠంచనుగా బయోమెట్రిక్‌ పంచ్‌ కొట్టే హెచ్‌వోడీ శ్రీనివాసరావు.. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు కన్సల్టెంట్‌గా వెళ్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌ పరిసరాల్లో ఉన్న కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కన్సల్టెంట్‌గా పని చేయడంపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేజీహెచ్‌లో జీతం తీసుకుంటూ.. కనీసం గంట సేపైనా విధులు నిర్వర్తించకపోవడంపై పలువురు వైద్యులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోండి!
హెచ్‌వోడీ పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ ఆడిందే ఆటగా సాగుతోంది. గ్యాస్ట్రో ఎంట్రాలజీ సమస్యలతో వస్తున్న రోగులను అక్కయ్యపాలెంలో ఉన్న హెచ్‌వోడీ శ్రీనివాసరావు ఆస్పత్రికి వెళ్తే.. మంచి వైద్యం అందుతుందని ఓపీ సిబ్బంది చెబుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్తోమత లేక దూర ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వైద్యం కోసం వస్తుంటే.. తీరా ఇక్కడికి వచ్చాక.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోమంటున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యతలు పీజీలకు..
కేజీహెచ్‌ నుంచి నేరుగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్న డా.శ్రీనివాసరావు.. తాను చెయ్యాల్సిన పనుల్ని సైతం పీజీ విద్యార్థులకు అప్పగించేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ముఖ్యమైన పరీక్షలకు తప్పనిసరిగా హెచ్‌వోడీ ఉండాల్సిన అవసరం ఉన్నా.. వాటికి సైతం హాజరు కాకుండా.. ఆ పరీక్షలు కూడా పీజీలే చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదీ గ్యాస్ట్రో ఓపీ తీరు
గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ సోమవారం, బుధవారం, శనివారం ఉంటుంది. ఇతర విభాగలతో కలిసి ఓపీ ఉన్న సోమవారం, శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. బుధవారం రోజున మాత్రం ఒక్క గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీ మాత్రమే ఉంటుంది. గతంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఓపీ ఉండేది. వైద్యుల సౌలభ్యం కోసం ఈ సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు.

Advertisement
Advertisement