పెద్ద దిక్కును కోల్పోయాం..

11 Jun, 2017 04:45 IST|Sakshi
పెద్ద దిక్కును కోల్పోయాం..

దర్శకరత్న దాసరి సంతాప సభల్లో వక్తలు
► ఎంతోమందికి ఆప్యాయతను పంచిన వ్యక్తి దాసరి: చిరంజీవి
► తండ్రి లాంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు..
► కులం అడగకుండా అవకాశమిచ్చారు..: ఆర్‌.నారాయణమూర్తి


సాక్షి, హైదరాబాద్‌: ‘దర్శకరత్న’ డాక్టర్‌ దాసరి నారాయణరావు కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించేవారని, సినీ పరిశ్రమలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేశారని వక్తలు పేర్కొన్నారు. సినీ పరిశ్రమల్లో 24 శాఖలకు వారధిగా ఉండేవారని, పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందని అన్నారు.

హైదరాబాద్‌లో శనివారం ఉదయం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, సాయంత్రం యావత్‌ చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు సంతాప సభలు జరిగాయి. ఈ రెండు సభల్లో పలువురు ప్రముఖులు పాల్గొని దాసరి వ్యక్తిత్వం గురించి, ఆయనతో తమ అనుబంధం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదని పేర్కొన్నారు.

తన కష్టాలుగా భావించారు: చిరంజీవి
దాసరి నారాయణరావు ఆస్పత్రిలో చేరిన మొదట్లో నేను వెళ్లినప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. పేపర్‌ తీసుకుని ‘నీ సినిమా స్కోర్‌ ఎంత’ అని అడిగారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన నా సినిమా ఎలా ఆడుతోందో తెలుసుకోవాలని ఉత్సాహం చూపించారు. ‘హయ్యస్ట్‌ గ్రాసర్‌ అవుతుంది’ అనగానే, చిన్న పిల్లాడిలా విజయ సంకేతం చూపించారు. ఆయన చివరి సారిగా పబ్లిక్‌ ఫంక్షన్‌లో మాట్లాడింది మా ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లోనే.

చివరిసారిగా ప్రెస్‌ను అడ్రెస్‌ చేస్తూ మే 4న తన పుట్టిన రోజు నాడు ఆయన మాట్లాడారు. ఆ రోజు శ్రీ అల్లు రామలింగయ్య అవార్డు ఆయనకు అందజేసినప్పుడు తన సంతోషాన్ని తెలియజేశారు. ఆయన ఆశీస్సులను మాకు అందజేశారు. ఆ రకంగానైనా ఆయన ఆశీస్సులు పొందడం, ఆ రెండు సభల్లో నేను పాలుపంచుకోవడం తృప్తినిచ్చింది. ఇటీవల వారి ఇంట్లో కొంతమంది పెద్దలతో సమావేశం జరిగినప్పుడు మేం 50 మందిదాకా వెళ్లాం. ‘నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలి. మన జిల్లా నుంచి వచ్చిన బొమ్మిడాయిలు తినాలి’ అంటూ దగ్గరుండి నాకు తినిపించి, పితృ వాత్సల్యం చూపించారు.

ఎంతోమందికి ఆప్యాయతానురాగాలు పంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేరు. ఈ రోజు ఎంతో మంది సినిమా కార్మికులు ఆ బాధను అనుభవిస్తున్నారు. అలాంటి బాధే నాకూ ఉంది. ఒక పెద్ద దిక్కును, తండ్రి వంటి వ్యక్తిని పోగొట్టుకుని సినీ కార్మికులు అనాథలయ్యారు. కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించారు. దాసరి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. తీర్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను.

గీతా ఆర్ట్స్‌ ఆయన వేసిన పునాదే
నా మొదటి రెండు సూపర్‌ హిట్స్‌ (‘బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే’)కి దాసరి దర్శకులు. గీతా ఆర్ట్స్‌ నలభై ఏళ్ళుగా నిలబడి ఉందంటే అది ఆయన వేసిన పునాదే. ప్రతి చిన్నవాడు కొట్టగలిగే ఒకే ఒక్క తలుపు దాసరి నారాయణరావు ఇల్లు. ఇండస్ట్రీలో నిర్మాతలకు, వర్కింగ్‌ క్లాస్‌కు మధ్య వారధిగా నిలిచిన వారు దాసరి. ఆ ‘వారధి’ లేరిప్పుడు. – నిర్మాత అల్లు అరవింద్‌

ప్రతి ఒక్కరికీ సాయం చేశారు
‘దాసరి నారాయణరావు తెలుగు చిత్రసీమకు గురువు. ఆయనకు ఎవరిపైనా ద్వేషం లేదు. అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశారు’ అని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో దర్శకుడు ‘ధవళ’ సత్యం అన్నారు. ఇటీవల స్వర్గస్తులెన దర్శకుల సంఘం సభ్యులు కేఎస్‌ రావుగారు, తిరుమలరావు మృతికి ఇదే వేదికపై సంతాపం ప్రకటించారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ మాట్లాడుతూ ‘చిత్రసీమలోని 24 శాఖల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించ గల గొప్పవ్యక్తి దాసరిని కోల్పోవడం మన దురదృష్టం. ఈ కార్యక్రమానికి రాలేని దర్శకులకు దండాలు. తెలిసీ రాని దర్శకులకు శతకోటి దండాలు’ అని అన్నారు. కార్యక్రమంలో దర్శకులు ముత్యాల సుబ్బయ్య, రేలంగి నరసింహారావు, క్రిష్ణమోహన్‌రెడ్డి, సత్యనాయుడు, రాజేంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంత చెప్పినా తక్కువే
మద్రాసులో ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ‘తమ్ముడూ..’ అని పలకరించిన నా గురువు దాసరి నారాయణ రావును ఎప్పటికీ మరచిపోలేను. నీ కులమేంటి? మతమేంటి అని అడగకుండా అవకాశం ఇచ్చిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. – నటుడు, దర్శకనిర్మాత   ఆర్‌.నారాయణమూర్తి

మరిన్ని వార్తలు