మండలి రేసులో గులాబీ గుర్రాలెవరో..!

13 Feb, 2015 03:24 IST|Sakshi

- పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీకి భారీ క్యూ
- తెరపైకి తటస్థుల పేర్లు
- అధినేత ఆశీస్సులున్న వారికే చాన్స్?

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో మండలి టికెట్ల లొల్లి గుబులు రేపుతోంది. వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి అనుగుణంగానే  టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా అధికంగానే ఉండడం... పార్టీతో సంబంధం లేని తటస్థుల పేర్లూ తెరపైకి రావడంతో ఇది మరింత రసవత్తరంగా సాగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ ఎన్నికలు ఉండడంతో పార్టీ ఆసాంతం మండలి ముచ్చట్లలో నే మునిగిపోయింది. పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న డాక్టర్ కె.నాగేశ్వర్ (మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్), కపిలవాయి దిలీప్ కుమార్ (వరంగల్ - ఖమ్మం - నల్లగొండ )ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం కూడా అదేరోజు ముగియనుంది. మండలి ఎన్నికల్లో బరిలో దిగాలనుకునేవారు ముందునుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి పెట్టారు. అధికార టీఆర్‌ఎస్‌లో ప్రస్తుత పరిస్థితి చూస్తే పట్టభద్రుల నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ‘కడియం’ ైవె పే మొగ్గు!
 వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. దీంతో ఆయనకు మండలిలో చోటు కల్పిస్తారని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. అయితే, ఎలాంటి ఇబ్బంది ఉండని ఎమ్మెల్యే కోటా నుంచే ఆయనను మండలికి పంపుతారని భావించినా... వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి కడియం పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాజకీయ సమీకరణల వల్ల టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే  నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు పోటీ పడుతున్నారు. వరంగల్ జిల్లాకే చెందిన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకుడు మర్రి యాదవరెడ్డి కూడా తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా టీఆర్‌ఎస్ అధినేతను కోరినట్లు తెలుస్తోంది.
 
ప్రచారంలో సుద్దాల అశోక్‌తేజ పేరు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది. ఇందులో సినీ పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వామపక్షాల కూటమి ఈసారి ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను కాదని సుద్దాల అశోక్‌తేజను బరిలోకి దింపాలని యోచిస్తుండగా... ఆయన మాత్రం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మద్దతుతోనే పోటీ చేస్తానని, లేదంటే పోటీలో ఉండనని చెబుతున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ మద్దతు ఇస్తే నాగేశ్వర్ కూడా బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, వారిద్దరూ ఈ విషయమై ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మరోవైపు టీఎన్జీవో నేత దేవీప్రసాద్‌ను ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్న వ్యూహంలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. కానీ, దేవీప్రసాద్ తనకు ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పూల రవీందర్ ద్వారా పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి ద్వారా టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి కూడా తమకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
 

>
మరిన్ని వార్తలు