భూగర్భ గదిలో వారం నుంచి మహిళ

5 Sep, 2018 02:31 IST|Sakshi
అంజమ్మ

మెదక్‌ జిల్లాలో వెలుగులోకి..

తూప్రాన్‌: మూఢత్వమో.. దైవత్వమో.. భక్తి మార్గమో తెలియదు. కానీ మాతమాణికేశ్వరి శిష్యురాలిగా చెప్పుకుంటున్న ఓ భక్తురాలు సజీవంగా భూగర్భంలో యోగనిద్ర చేస్తున్న ఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర ఆలయంలో చోటుచేసుకుంది. ఆమె శిష్యులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. వారం రోజులుగా భూగర్భంలోని ఓ చిన్న గదిలో ఆమె తపస్సు చేస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ పట్టణానికి చెందిన అంజమ్మ అనే భక్తురాలు తాను శ్రీమాణికేశ్వరిమాత శిష్యురాలినని గ్రామస్తులకు తెలిపింది.

లోక కల్యాణమే పరమావధిగా వారం రోజులపాటు గాలి, వెలుతురు లేని భూగర్భ గదిలో యోగముద్రలో ఆమె గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. గత గురువారం ఉదయం 11:30 గంటలకు మాత అంజమ్మ రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న ఓ భూగర్భ గదిలోకి వెళ్లింది. గది పైనుంచి శిష్యులు ఇటుకల గోడతో పూర్తిగా మూసివేశారు. బుధ వారం 7వ రోజు యోగముద్ర నుంచి బయటకు వస్తుందని ఆమె శిష్యులు చెబుతున్నారు. బుధ వారం ఆమె బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని తన ఆశ్రమంలో ఇప్పటి వరకు 8 సార్లు భూగర్భంలో తపస్సు చేసినట్లు తెలిపారు. ఏటా శ్రావణ మాసంలో 41 రోజులు దీక్ష చేపట్టి 7 రోజులు భూగర్భంలో తపస్సు చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు