తగులబెట్టబోయి.. 

13 Jun, 2018 08:34 IST|Sakshi
బూడిదైన వస్తువులు, గాయపడిన నవీన్‌

మామూళ్లు ఇవ్వనందుకు డెకరేషన్‌ గోదాంకు నిప్పు 

మంటల్లో గాయపడిన యువకుడు 

 ఆస్పత్రిలో చికిత్స 

అల్వాల్‌ : నెల మామూళ్లు ఇవ్వనందుకు గోదాంపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన యువకుడు ఆదే మంటల్లో గాయపడి ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో  చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అల్వాల్‌కు చెందిన శ్యామ్‌ స్థానిక జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయం సమీపంలో ఎంబి సౌండ్స్‌ పేరుతో శుభకార్యాలకు డెకరేషన్, లైట్లు, జనరేటర్లను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గోదాంలో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అదే ప్రాంతానికి చెందిన నవీన్‌యాదవ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన నవీన్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

మాముళ్లు ఇవ్వనందుకే: గోదాం యజమాని శ్యామ్‌ 
బాధితుడు నవీన్‌ యాదవ్‌ నెలకు రూ. 10 వేలు మామూళ్లు ఇవ్వాలని కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని అందుకు అంగీకరించకపోవడంతో గోదామును తగులబెడతానని హెచ్చరించినట్లు యజమాని శ్యామ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం గోదాంలో పనిచేసే సంపత్‌తో పెట్రోల్‌ తెప్పించి గోదాంలోకి వెళ్లి నిప్పంటించి తలుపులు మూసి బయటివచ్చి నిలబడినట్లు తెలిపాడు. గోదాంలోని బ్యాటరీలు పేలడంతో మంటలు ఎగిసిపడి నవీన్‌పై పడడంతోనే గాయపడినట్లు తెలిపాడు. తనతోపాటు పలువురిని మాముళ్ల కోసం వేదిస్తున్నాడని పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  సంఘటనా స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ శ్రీకాంత్‌గౌడ్‌ పరిశీలించి  వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా నవీన్‌యాదవ్‌పై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయని స్థానికంగా సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు