మృత్యువుతో సయ్యాట

12 May, 2015 01:07 IST|Sakshi

- రాత్రంతా షికార్లు..పొద్దంతా నిద్ర
- పాతబస్తీలో కొందరు యువకుల తీరు ఇదీ
- కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులుగా మారుతున్న వైనం.
- ఇటీవల తల్లిదండ్రులకు డీసీపీ కౌన్సెలింగ్
- తాజాగా వెలుగులోకి వచ్చిన స్ట్రీట్ ఫైట్
చాంద్రాయణగుట్ట:
పాతబస్తీలోని కొందరు యువకులు సరదాలు ప్రాణాంతంగా మారుతున్నారు. సరదాకోసం కొందరు ఎంతటి సాహసానికైనా ఒడిగట్టడం ఆందోళన కలిగిస్తోంది. గ్రూప్‌లుగా ఏర్పడి రాత్రి పూట బైక్‌లపై సవారీ చేయడం, పగటి పూట జరిగిన చిన్నచిన్న సంఘటనలను సాకుగా తీసుకుని ప్రతీకార దాడులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి మరీ హద్దు మీరి ప్రవర్తిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.

ఇందులో భాగంగానే హిమాయత్ సాగర్‌పై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న దాదాపు వంద మంది యువకులు ఇటీవల పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. చార్మినార్, డబీర్‌పురా, మీర్‌చౌక్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, హసన్‌నగర్, కామాటీపురా, కాలాపత్తర్, ఫలక్‌నుమా, జంగమ్మెట్, జీఎం కాలనీ, చాంద్రాయణగుట్ట, బాబానగర్, బండ్లగూడ, బార్కాస్, పహాడీషరీఫ్, షాయిన్‌నగర్, ఎర్రకుంట, రియాసత్‌నగర్, సంతోష్‌నగర్, ఈదిబజార్, తలాబ్‌కట్టా తదితర బస్తీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి క్రికెట్, ఫుట్‌బాల్ తదితర ఆటల్లో తలెత్తే వివాదాలు కూడా దాడులు, ప్రతిదాడులకు కారణమవుతున్నాయి.

స్నేక్ గ్యాంగ్ నుంచి స్ట్రీట్ ఫైట్ వరకు.
ఈ సంసృ్కతి నగర శివారు బస్తీలకు విస్తరించింది. ఈ క్రమంలోనే పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేక్‌గ్యాంగ్ ఘటన వెలుగు జూసిన విషయం తెలిసిందే. దాదాపు పది మంది యువకులు గ్యాంగ్‌గా ఏర్పడి ఇలాంటి అరాచకాలకు నాంది పలికారు. ఎన్నో ఘటనలకు పాల్పడిన ఈ ముఠా చివరకు ఫాం హౌస్‌లో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ సంఘటన తరువాత కూడా వారిలో మార్పు రాకపోగా, కొత్త కోణాలు వెలుగులోకి రావడం గమనార్హం. తాజాగా స్ట్రీట్ ఫైట్ ఘటనలో నబీల్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

పిల్లలపై దృష్టి సారించాలి
తమ పిల్లల వ్యవహారశైలిపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాగానే ఎక్కడికి వెళ్లావు...? ఏ పని మీద వెళ్లావు..? అనే విషయాలపై ఆరా తీస్తే వారిలో భయం ఏర్పడుతుంది. అయితే కొందరు తల్లిదండ్రులు కనీసం పట్టించుకోకపోవడంతో పిల్లలు ఆడిందే ఆట....పాడిందే పాట అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో కొందరు యువకులు దారితప్పుతున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. 2012లో ఉప్పుగూడలోని గుల్షన్ ఎక్బాల్ కాలనీకి చెందిన విద్యార్థి ఒబేద్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నాయని కర్ణాటక పోలీసులు తీసుకెళ్లేంత వరకు కూడా తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు